
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ పసిబిడ్డను కన్నతల్లే అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపింది. తన బిడ్డ ఒక మేకలా ఉన్నాడని, అందుకే అతణ్ని తిరిగి అక్కడికే చేర్చానని సంబంధం లేకుండా మాట్లాడడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అరెస్ట చేశారు. వివరాల్లోకి వెళ్తే… చురారు గ్రామానికి చెందిన రష్మీ లోథి తన 8 నెలల బాబుతో శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లింది. తిరిగి సాయంత్రం సమయంలో చేతిలో రక్తసిక్తమైన ఆ బిడ్డతో ఇంటికి చేరింది.
అది చూసి షాకైన ఆమె తండ్రి.. ఆమెను నిలదీయగా తన కొడుకు ఓ మేక అని, అతను మనిషి జాతికి సంబంధించిన వాడు కాదని.. అందుకే తన జాతికి పంపించానని అర్ధ రహితంగా బదులిచ్చింది. దీంతో ఆమె తండ్రి ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల ప్రాథమిక విచారణలో.. రష్మీ ఆ బిడ్డను హైవే పై తీసుకెళ్లి, ఆ తర్వాత గొడ్డలి తో నరికి చంపినట్లుగా తేల్చారు. బాలుడి మెడపై పలుచోట్ల గొడ్డలి పోట్లు ఉన్నాయని చెప్పారు. ఆమె మానసిక పరిస్థితిపై అనుమానాలున్నాయని, ఆమెను సైకియాట్రిక్ తరలించామని అన్నారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఆ గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.