చైనాతో వివాదాన్ని సొంతంగా పరిష్కరించుకుంటాం

చైనాతో వివాదాన్ని సొంతంగా పరిష్కరించుకుంటాం

అమెరికాకు స్పష్టం చేసిన ఇండియా
న్యూఢిల్లీ: చైనాతో కొనసాగుతున్న వివాదాన్ని చర్చల ద్వారా సొంతంగా పరిష్కరించుకుంటామని అమెరికాకు ఇండియా స్పష్టం చేసిందని సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. చైనాతో వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని రాజ్ నాథ్ చెప్పారు. ‘నిన్న (శుక్రవారం) యూఎస్ డిఫెన్స్ సెక్రటరీతో మాట్లాడా. చైనాతో వివాదాన్ని పరిష్కరించేందుకు తగిన మార్గాలు మాకు ఉన్నాయని వారికి చెప్పా. మిలిటరీ లెవల్స్ తోపాటు దౌత్యపరమైన చర్చలు కూడా ఇందులో ఓ భాగం. చైనాతో చర్చలు జరుగుతున్నాయి’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. చైనాకు ఇండియాకు మధ్య లడఖ్ రీజియన్ లో ఎల్ వోసీ గుండా జరుగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించం కోసం మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మరుసటి రోజే రాజ్ నాథ్ ఇలా స్పందించారు.

‘ఉద్విగ్న పరిస్థితులు మరింత పెరగకుండా ఇండియా ప్రయత్నిస్తోంది. చైనాతో మిలిటరీ పరంగానూ అలాగే దౌత్య పరంగానూ చర్చలు కొనసాగుతున్నాయి. చైనా కూడా ఈ వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని చెప్పింది. ఇండియా తన పొరుగు దేశాలతో ఎప్పుడూ శాంతియుత సంబంధాలను నెరపడానికే యత్నిస్తుంది. మేం ఏ దేశానికీ సవాల్ విసరాలని అనుకోం. నేపాల్ మాకు సోదర దేశం. మా మధ్య ఏర్పడిన వైరుధ్యాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.