నీట్ బాధితులను మర్చిపోయారా? ప్రధాని మోదీకి రాహుల్ ప్రశ్నలు

నీట్ బాధితులను  మర్చిపోయారా? ప్రధాని మోదీకి రాహుల్ ప్రశ్నలు
  • చనిపోయిన పిల్లలు గుర్తురాలేదా? 

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడంపై  లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల గురించి ప్రధాని కనీసం ఆలోచించారా? అని ప్రశ్నించారు. 

శుక్రవారం రాహుల్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. కుప్పకూలిన విద్యావ్యవస్థ వల్లే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. "ధర్మేంద్ర ప్రధాన్‌‌ను మోదీ ప్రశంసిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు, చనిపోయిన ఆ పిల్లలు ఒక్క క్షణమైనా గుర్తుకు రాలేదా?" అని ప్రశ్నించారు. కాగా, లోక్‌‌సభ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా రాహుల్ స్పందిస్తూ.. దేశ ప్రజల తరఫున తన పోరాటం నిరంతరం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ రెండేండ్లలో తాను పార్లమెంటు లోపల, బయట లేవనెత్తిన వివిధ ప్రజా సమస్యలపై రూపొందించిన ఒక సంక్షిప్త వీడియోను పోస్ట్ చేశారు. "నేను లోక్‌‌ సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి నేటికి రెండేండ్లు పూర్తయ్యాయి. ఈ రెండేండ్లలోని ప్రతిరోజూ సామాన్యుడి గొంతుకను వినిపించడానికే అంకితం చేశాను." అని పేర్కొన్నారు.