నేడు సౌతాఫ్రికాతో ఇండియా మూడో టీ20

నేడు సౌతాఫ్రికాతో ఇండియా మూడో టీ20

ఇండోర్‌‌‌‌: సౌతాఫ్రికాపై ఇప్పటికే సిరీస్‌‌ను సొంతం చేసుకున్న ఇండియా టీమ్‌‌.. క్లీన్‌‌స్వీప్‌‌పై దృష్టిపెట్టింది. మంగళవారం జరిగే ఆఖరిదైన థర్డ్‌‌ టీ20లోనూ గెలిచి సఫారీలను వైట్‌‌వాష్‌‌ చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. అయితే సిరీస్‌‌ పరంగా ఈ మ్యాచ్‌‌లో గెలిచినా, ఓడినా పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. రోహిత్‌‌సేన బౌలర్లు మాత్రం మరోసారి కఠిన పరీక్ష ఎదుర్కోనున్నారు. ఆసీస్‌‌లో టీ20 వరల్డ్‌‌కప్‌‌కు చాలా తక్కువ సమయమే ఉండటంతో.. ఇప్పటికీ డెత్‌‌ ఓవర్స్‌‌ వేసే సరైన బౌలర్లను టీమిండియా వెతికి పట్టుకోలేకపోయింది. బుమ్రా గైర్హాజరీ, రెండో టీ20లో మిల్లర్ మెరుపులతో అర్ష్‌‌దీప్‌‌, హర్షల్‌‌, దీపక్‌‌ చహర్‌‌ తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. కనీసం ఈ మ్యాచ్‌‌లోనైనా వీళ్లు గాడిలో పడతారా? 

కోహ్లీ ప్లేస్‌‌లో శ్రేయస్‌‌

స్వదేశంలో సఫారీలపై తొలి సిరీస్‌‌ గెలిచిన ఆనందంలో ఉన్న ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌.. ఈ మ్యాచ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ, కేఎల్‌‌ రాహుల్‌‌కు రెస్ట్ ఇచ్చింది. కోహ్లీ ప్లేస్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ను టీమ్‌‌లోకి తీసుకుంది. ఈ నెల 6న ఆసీస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కేముందు విరాట్‌‌, రాహుల్‌‌ టీమ్‌‌తో కలవనున్నారు. యూఏఈలో ఆడిన మెజారిటీ బ్యాటర్లు ఆసీస్‌‌కు వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరూ ఫామ్‌‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. గతంతో పోలిస్తే ఈసారి ప్రతి బ్యాట్స్‌‌మెన్‌‌లో అటాకింగ్‌‌ దృక్పథం మారింది. రోహిత్‌‌తో కలిసి పంత్‌‌ లేదా సూర్యకుమార్‌‌లో ఒకరు ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించే చాన్స్‌‌ ఉంది. రాహుల్‌‌ ప్లేస్‌‌లో ఎవర్ని తీసుకోలేదు కాబట్టి షాబాజ్‌‌ అహ్మద్‌‌, ఉమేశ్‌‌, సిరాజ్‌‌లో ఒకరు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లోకి రావొచ్చు. ఈ సిరీస్‌‌లో పెద్దగా బ్యాటింగ్‌‌ చాన్స్‌‌ రాని సూపర్ ఫినిషర్‌‌ దినేశ్‌‌ కార్తీక్‌‌ భారీ ఇన్నింగ్స్‌‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌‌తో బౌలింగ్‌‌ కష్టాలకు కొంతైనా చెక్‌‌ పెట్టాలని ద్రవిడ్‌‌ అండ్‌‌ కో భావిస్తోంది. ముఖ్యంగా డెత్‌‌ ఓవర్స్‌‌లో తేలిపోతున్న దీపక్‌‌ చహర్‌‌, అర్ష్‌‌దీప్‌‌, హర్షల్‌‌ పటేల్‌‌ను గాడిలో పడేలా చేయాలని చూస్తోంది. స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ వికెట్ల వేటలో వెనుకబడిపోతున్నాడు. ఇండోర్‌‌ పిచ్‌‌ కూడా బ్యాటింగ్‌‌కు అనుకూలమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఛేజింగ్‌‌కు మొగ్గు చూపే చాన్స్‌‌ ఉంది. 

మిల్లర్‌‌ను ఆపేదెలా?

సౌతాఫ్రికా సిరీస్‌‌ను చేజార్చుకున్నా.. బ్యాటింగ్‌‌లో మాత్రం ఎన్నో సానుకూలతలను ఏర్పర్చుకుంది. ఓపెనర్‌‌గా కెప్టెన్‌‌ బవుమా ఫామ్‌‌ ఒక్కటే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుండగా, డికాక్‌‌ ఫామ్‌‌లోకి రావడం సానుకూలాంశం. తన హిట్టింగ్‌‌తో డేవిడ్‌‌ మిల్లర్‌‌.. ఇండియాతో పాటు మిగతా దేశాలకు కూడా ప్రమాద హెచ్చరికలు పంపాడు. రోసోవ్‌‌, మార్‌‌క్రమ్‌‌ ఇంకాస్త గాడిలో పడితే సఫారీలకు తిరుగుండదు. స్టబ్స్‌‌, పార్నెల్‌‌ బ్యాట్లకు పని చెప్పితే ఎంత పెద్ద టార్గెట్‌‌ అయినా కరిగిపోవాల్సిందే. ఆల్‌‌రౌండర్‌‌గా కేశవ్‌‌ టీమ్‌‌కు అండగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌‌లో రబాడ, ఎంగిడి, నోర్జ్‌‌ పేస్‌‌ ప్రభావం తగ్గడం ప్రతికూలాంశం. ఈ మ్యాచ్‌‌తో త్రయం గాడిలో పడాల్సిందే. లేదంటే వరల్డ్‌‌కప్‌‌లో ఇబ్బందులు తప్పవు. స్పిన్నర్లు కేశవ్‌‌, శంసి ఫర్వాలేదనిపిస్తున్నారు. 

జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌), పంత్‌‌, శ్రేయస్‌‌, సూర్యకుమార్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, షాబాజ్‌‌ అహ్మద్‌‌, హర్షల్‌‌ పటేల్‌‌, దీపక్‌‌ చహర్‌‌, అశ్విన్‌‌, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌. 
సౌతాఫ్రికా: బవుమా (కెప్టెన్‌‌), డికాక్‌‌, రోసోవ్‌‌ / హెండ్రిక్స్‌‌, మార్‌‌క్రమ్‌‌, మిల్లర్‌‌, స్టబ్స్‌‌, పార్నెల్‌‌, కేశవ్‌‌, రబాడ, నోర్జ్‌‌, ఎంగిడి.