హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో థార్ కారు బీభత్సం సృష్టించింది. శనివారం (జూన్ 13) ఉదయం పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న అన్నదమ్ములను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దాసరి నారాయణ కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
TG 08 A 7887 నంబర్ గల థార్ కారు పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అఖిలేశ్వర్(22), విగ్నేశ్వర్(16) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు తెలిపారు. కార్ లో బీరు బాటిళ్లు ఉండటం చూసి షాకయ్యారు. తాగి మనుషుల ప్రాణాలు తీస్తారా..? అంటూ ఆగ్రహానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
