బర్త్​ డే పార్టీలో గంజాయి... నిందితుల అరెస్ట్

బర్త్​ డే పార్టీలో గంజాయి... నిందితుల అరెస్ట్

ఎల్​బీనగర్, వెలుగు: సిటీ శివార్లలోని  ఓ రిసార్టులో జరిగిన బర్త్​ డే పార్టీలో గంజాయిని గుర్తించిన హయత్​నగర్ పోలీసులు 29 మంది యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, ఒక బైక్, డీజే సౌండ్ సిస్టం స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీ స్టూడెంట్లని సమాచారం. హయత్​నగర్ పరిధి పసుమాముల గ్రామ శివారులోని ఓ రిసార్టులో కొంతమంది రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న హయత్ నగర్  పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు సోదాలు చేశారు. రిసార్టులోని కాటేజీల్లో తనిఖీలు చేయగా గంజాయి దొరికింది. జితిన్ సుభాష్ అనే యువకుడు తన బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్​​కు పార్టీ ఇస్తున్నాడు. రోహిత్ అనే యువకుడు గంజాయి సప్లయ్ చేసినట్లు సమాచారం. జితిన్ సుభాష్​ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోహిత్ పరారీలో ఉన్నాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు దాచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలోనూ పసుమాముల సమీపంలోని ఓ రిసార్టులో జరిగిన రేవ్ పార్టీలో వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులు పట్టుబడ్డ విషయం తెలిసిందే.

హయత్ నగర్ పీఎస్​లో యువకుడి హల్ చల్

రేవ్ పార్టీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న స్టూడెంట్ల తరఫున వచ్చిన కుంట్లూరుకు చెందిన మణికంఠ అనే యువకుడు హయత్​నగర్ పీఎస్​లో హల్​చల్ చేశాడు. డీఐ నిరంజన్​పై దురుసుగా ప్రవర్తించాడు.  మణికంఠను పీఎస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డీఐ ఇచ్చిన కంప్లయింట్ మేరకు మణికంఠపై కేసు నమోదైంది.