హెచ్‌‌సీఏ పీఠం ఎవరిదో.?

హెచ్‌‌సీఏ పీఠం ఎవరిదో.?

హైదరాబాద్‌‌, వెలుగు:  సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న  హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) ఎలక్షన్స్‌‌కు రంగం సిద్ధమైంది. వచ్చే మూడేళ్ల పాటు హెచ్‌‌సీఏను నడిపించే  నయా కెప్టెన్‌‌ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అసోసియేషన్‌‌ నూతన పాలక వర్గానికి శుక్రవారం ఉప్పల్‌‌ స్టేడియంలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌‌ ముగిసిన అనంతరం కౌంటింగ్‌‌ నిర్వహించి, విజేతలను ప్రకటించనున్నారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం మూడేళ్ల కాలపరిమితికి గాను ప్రెసిడెంట్‌‌, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌, సెక్రెటరీ, జాయింట్‌‌ సెక్రెటరీ, ట్రెజరర్‌‌, కౌన్సిలర్‌‌ ఆరు పోస్ట్‌‌లకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఆరు పోస్టుల కోసం 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  మొత్తం 226 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ మేరకు ఎలక్టోరల్‌‌ ఆఫీసర్‌‌ వీఎస్​ సంపత్‌‌ ఓటర్‌‌ లిస్ట్‌‌ను విడుదల చేశారు. ఇందులో 155 ప్రైవేట్‌‌ క్లబ్స్‌‌, 51 ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ క్లబ్స్‌‌,  9 జిల్లా క్రికెట్‌‌ సంఘాలు, 11 మంది ఇంటర్నేషనల్‌‌ మాజీ  క్రికెటర్లు ఉన్నారు. కాగా, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ మినహా మిగతా ఐదు పోస్ట్‌‌లకు త్రిముఖ పోటీ నెలకొంది. మాజీ ప్రెసిడెంట్‌‌ జి. వివేక్‌‌ వెంకటస్వామి మద్దతు తెలుపుతున్న  ప్రకాశ్‌‌చంద్‌‌ జైన్‌‌ ప్యానెల్, ఇండియా మాజీ క్రికెటర్‌‌ అజరుద్దీన్‌‌ గ్రూప్‌‌తో పాటు మాజీ మెంబర్​ బాబూరావు నేతృత్వంలోని ఇండిపెండెంట్‌‌ ప్యానెల్‌‌ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ మినహా ఐదు పోస్టులకు పోటీలో నిలిచిందా గ్రూప్‌‌. అయితే, ప్రధాన పోటీ ప్రకాశ్‌‌చంద్‌‌, అజరుద్దీన్‌‌ గ్రూప్‌‌ల మధ్యనే ఉండనుంది. ప్రెసిడెంట్‌‌కు పోటీ చేస్తున్న  ప్రకాశ్‌‌చంద్‌‌ ప్యానెల్‌‌లో వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ కోసం దల్జీత్‌‌ సింగ్‌‌, సెక్రెటరీ రేసులో వెంకటేశ్వరన్‌‌ ఉన్నారు.

జాయింట్‌‌ సెక్రెటరీ కోసం శివాజీ యాదవ్‌‌, ట్రెజరర్‌‌ పోస్ట్‌‌ కోసం  హనుమంత్‌‌ రెడ్డి, కౌన్సిలర్‌‌ పదవికి రవీందర్‌‌ సింగ్‌‌ పోటీ పడుతున్నారు. తన నామినేషన్‌‌ను అన్యాయంగా రిజెక్ట్‌‌ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన వివేక్‌‌ వెంకటస్వామి మద్దతు ఉండడం వీరికి ప్లస్‌‌ పాయింట్‌‌. గత టర్మ్‌‌లో  ప్రెసిడెంట్‌‌గా పని చేసిన వివేక్‌‌.. బీసీసీఐ నుంచి నిధులు రాకపోయినా కూడా  మ్యాచ్‌‌లకు, సంఘం కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉప్పల్‌‌ స్టేడియం నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు హెచ్‌‌సీఏ అభివృద్ధికి వివేక్‌‌ ఫ్యామిలీ తోడ్పాటు ఉందన్న విషయం అసోసియేషన్‌‌లో అందరికీ తెలుసని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. పైగా, మరో ప్యానెల్‌‌లో అధ్యక్ష రేసులో నిలిచిన అజరుద్దీన్‌‌పై బీసీసీఐ బ్యాన్‌‌ ఎత్తివేయకపోవడం, ఆ వర్గంలోని మిగతా పోటీదారులపై ఏసీబీ కేసులు ఉండడం వారికి ప్రతికూలాంశమని అంటున్నారు. గతంలో హెచ్‌‌సీఏకు గానీ, క్రికెట్‌‌ గానీ ఏమీ చేయకుండా ఎలక్షన్స్‌‌ రాగానే తెరమీదకు వచ్చిన అజర్‌‌ను అసోసియేషన్ మెంబర్లు నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు.