సంతకాలు ఫోర్జరీతోనే... హెచ్‌సీఏ అధ్యక్షుడైన జగన్మోహన్ రావు..! ఐపీఎల్ టికెట్ల తీగ లాగితే కదిలిన డొంక

సంతకాలు ఫోర్జరీతోనే... హెచ్‌సీఏ అధ్యక్షుడైన జగన్మోహన్ రావు..! ఐపీఎల్ టికెట్ల తీగ లాగితే కదిలిన డొంక
  • నకిలీపత్రాలు సృష్టించిన శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కవిత
  • మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకం కూడా ఫోర్జరీ
  • ఐపీఎల్ టికెట్ల తీగ లాగితే కదిలిన అసలు డొంక

హైదరాబాద్: హెచ్‌సీఏ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయ్యేందుకు కవిత తనవంతు ప్రయత్నాలు చేసినట్టు తేలింది. 

ALSO READ | HCA ప్రెసిడెంట్ అరెస్టు.. సంతకం ఫోర్జరీ చేసి పదవిలోకి.. కళ్లు చెదిరే నిజాలు బయటపెట్టిన CID

శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న కవిత జగన్మోహన్ రావుకు మద్దతుగా  గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి  కృష్ణయాదవ్ సంతకం ఫోర్జరీ చేసినట్టు సమాచారం.  ఈ పత్రాలను ఉపయోగించిన జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడైన తర్వాత భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురువా రెడ్డి ఫిర్యాదు చేయగా సీఐడీ దర్యాప్తు చేపట్టింది.  

తీగలాగితే కదిలిన డొంక

ఐపీఎల్ మ్యాచ్ ల వేళ హెచ్సీఏ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది.  ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని తెలుస్తుండటంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో కస్టడీ విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.