ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. రూపురేఖలు మారబోతున్నాయి

ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. రూపురేఖలు మారబోతున్నాయి

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపురేఖలు మారబోతున్నాయి. ఉప్పల్ స్టేడియం ఆధునీకరణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కొటేషన్లను ఆహ్వానిస్తోంది. సుందరీకరణ పనుల్లో భాగంగా కొత్త కుర్చీలు, తూర్పు మరియు పశ్చిమ స్టాండ్‌లలో ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, వాటర్ ప్రూఫింగ్, వాష్ రూముల నిర్వహణ, కొన్ని స్టాండ్లకు మెరుగులు దిద్దడం వంటివి రెనోవేట్ చేయనున్నారు. హెచ్‌సీఏ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియంతో సహా దేశంలోని మరో నాలుగు మైదానాల్ని ఆధునికీకరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మొత్తంగా 502.92 కోట్లను కేటాయించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియానికిరూ.117.17 కోట్లు కేటాయించగా, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌కు రూ.127.47 కోట్లు, ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, పంజాబ్‌లోని మొహాలీ స్టేడియానికి రూ.79.46 కోట్లు, ముంబై వాంఖడేకు రూ.78.82 కోట్లు కేటాయించింది.

అయితే వీటితో పాటు ఎప్పట్నుంచో పెండింగులో ఉన్న దక్షిణ భాగం పైకప్పును మరమ్మత్తు చేసి పుణ్యం కట్టుకోవాలని తెలుగు అభిమానులు.. బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ సమరం మొదలుకానుంది. మొత్తం 46 రోజుల పాటు సాగే ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరుగుతాయి. 2011లో భారత్‌ చివరిసారిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వగా.. ధోని సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది.