
హైదరాబాద్: ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారన్న కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకు మల్కాజిగిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్ రావుతో పాటు ఈ కేసులోని మిగితా నిందితులకు కూడా 14 రోజుల రిమాండ్ విధిస్తూ మల్కాజిగిరి కోర్టు గురువారం (జూలై 10) ఆదేశాలు జారీ చేసింది.
నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో A6గా ఉన్న మహిళా నిందితురాలు కవితను చంచల్ గూడా మహిళ జైలుకు తరలించారు.
కాగా, ఐపీఎల్ టికెట్ల విషయంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారన్న ఆరోపణలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో సెక్రటరీ దేవరాజ్ పరారీలో ఉండగా మిగిలిన నిందితులందరిని బుధవారం (జూలై 9) రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి గురువారం (జూలై 10) మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల అభ్యర్థన మేరకు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మల్కాజిగిరి కోర్టు. దీంతో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
ఈ సందర్భంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తరపు న్యాయవాది కిరణ్ మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రావుకు మల్కాజ్గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిందని తెలిపారు. హెచ్‌సీఏ అధ్యక్షులుగా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపామన్నారు. ఎలాంటి నోటీసులు జారీ చెయ్యకుండా సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. శుక్రవారం (జూలై 11) బెయిల్ పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు.