
హైదరాబాద్, వెలుగు: ఇండియా - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయంలో గంగరగోళం, జింఖానా గ్రౌండ్స్ వద్ద తోపులాట జరిగి అభిమానులు గాయాల పాలవడంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. నిధుల దుర్వినియోగం, టీమ్ సెలెక్షన్స్‌లో అవినీతి, బంధుప్రీతి, వర్గ పోరుతో తరచూ వార్తల్లో నిలిచే హెచ్‌సీఏ ఇప్పుడు ఓ మ్యాచ్ టికెట్లు కూడా సజావుగా విక్రయించలేకపోయిందన్న అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఒకరిద్దరి తీరుతో హెచ్‌సీఏ, హైదరాబాద్ పరువు పోయింది. సాధారణంగా ఇంటర్నేషనల్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్‌లకు ముందు హెచ్‌సీఏ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని టికెట్లు, ఏయే రేట్లలో అందుబాటులో ఉన్నాయనే వివరాలు వెల్లడించడం ఆనవాయితీ. ప్రతీసారి ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో టికెట్లు అమ్మేవారు. కానీ, ఈసారి హెచ్‌సీఏ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
టికెట్ల సేల్ గురించి ముందు నుంచి స్పష్టంగా చెప్పకుండా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఈ నెల 15న ‘పేటీఎం’లో క్షణాల్లో టికెట్లన్నీ మాయం అవడంపై వార్తలు వచ్చినా.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్, సెక్రటరీ విజయానంద్ స్పందించలేదు. అందుబాటులో ఉన్న 39 వేల టికెట్లలో ఎన్ని అమ్మారు? ఎన్ని మిగిలాయి? అనే విషయంలో అటు ‘పేటీఎం’ కూడా స్పష్టత ఇవ్వలేదు. తీరా బుధవారం ఫ్యాన్స్ జింఖానా ముట్టడించడంతో దారిలేక కౌంటర్లలో అమ్ముతామని అజరుద్దీన్ ప్రకటించాడు. అయితే, టికెట్లు కోసం ఫ్యాన్స్ వేలాదిలో వస్తారని తెలిసినా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయం.