నయా ఉదారవాదంతో మానవ విలువలు విధ్వంసం : హెచ్సీయూ సీనియర్ ప్రొఫెసర్ విజయ్

నయా ఉదారవాదంతో మానవ విలువలు విధ్వంసం : హెచ్సీయూ సీనియర్ ప్రొఫెసర్ విజయ్

హైదరాబాద్, వెలుగు:  నయా ఉదారవాద విధానాలు కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంతో పాటు మానవీయ విలువలు, మానవ సంబంధాలను విధ్వంసం చేస్తున్నాయని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి. విజయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్​లో యూటీఎఫ్​మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ మూడో వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రొఫెసర్ విజయ్ మాట్లాడారు. సమష్టితత్వం స్థానంలో వ్యక్తిగత స్వార్థం, వ్యక్తివాదం పెరిగాయని, ఫలితంగా మానవత్వం, నీతి, నిజాయితీ, జాలి, దయ వంటి లక్షణాలను బలహీనుల లక్షణాలుగా చిత్రీకరించి వ్యవస్థీకృతం చేశాయని విమర్శించారు. కనీస సామాజిక బాధ్యతను కూడా ఉచితాలుగా మార్చి లబ్ధి పొందే తీవ్రమైన దోపిడీ వ్యవస్థను ఈ విధానాలు నిర్మిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తి తన లాభం, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎదుటివారిని శత్రువులుగా, పోటీదారులుగా భావించే వాతావరణం నెలకొందని తెలిపారు.

 సమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ దోపిడీ వ్యవస్థను కూలదోయాల్సిన కర్తవ్యం సామాజిక స్పృహ ఉన్న అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్, రాష్ట్ర నేతలు మాణిక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగమణి, సోమశేఖర్, సింహాచలం, వెంకటప్ప, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.