
- లిక్కర్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి అఘాయిత్యానికి ప్రయత్నం
- ప్రతిఘటించిన స్టూడెంట్.. తప్పించుకుని వర్సిటీ ఆఫీసర్లకు ఫోన్
- ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్.. అరెస్టు చేసిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ప్రొఫెసర్ అతను. ‘‘నువ్వు హిందీలో వీక్‌గా ఉన్నావ్. మా ఇంటికి రా.. నీకు హిందీ నేర్పిస్తా. బుక్స్ కూడా ఇస్తా’’ అంటూ విదేశీ స్టూడెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్‌లో లిక్కర్ కలిపి బలవంతంగా తాగించాడు. తర్వాత అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి.. ప్రొఫెసర్ నుంచి తప్పించుకుని హెచ్‌సీయూ అధికారులకు సమాచారమిచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
కూల్ డ్రింక్‌లో విస్కీ కలిపి..
థాయిలాండ్‌కు చెందిన యువతి (25) నెల రోజుల కిందట హెచ్‌సీయూలో ఎంఏ హిందీ ఫస్ట్ ఇయర్‌లో చేరింది. క్యాంపస్‌లోని ఫారిన్ స్టూడెంట్ హాస్టల్‌లో ఉంటున్నది. వర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిందీలో ప్రొఫెసర్‌గా రవి రంజన్(63) పని చేస్తున్నాడు. కొండాపూర్‌లోని మజీద్‌బండలో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విద్యార్థినితో మాట్లాడిన అతడు.. హిందీలో వీక్‌గా ఉన్నావని, తన ఇంటికొస్తే నేర్పిస్తానని చెప్పాడు. కారులో ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో విద్యార్థినికి కూల్‌డ్రింక్‌లో విస్కీ కలిపి ఇచ్చాడు. ఆమె తాగనని చెప్పినా బలవంతంగా తాగించాడు. తర్వాత రవి కూడా మద్యం తాగి యువతిపై అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని.. తప్పించుకుని క్యాంపస్‌లోని ఫారిన్ హాస్టల్ ఇన్‌చార్జ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో హాస్టల్ ఇన్‌చార్జ్.. ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి విద్యార్థినిని క్యాంపస్‌కు తీసుకురావాలని చెప్పారు. ఆ ప్రొఫెసర్ స్టూడెంట్‌ని తన కారులో రాత్రి 8.30 గంటలకు వర్సిటీలో దింపేసి వెళ్లిపోయాడు. వర్సిటీ అధికారులు యువతికి క్యాంపస్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందించారు. రాత్రి 9 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు విద్యార్థిని ఫిర్యాదు చేసింది.
హెచ్‌సీయూ స్టూడెంట్స్ యూనియన్స్ ధర్నా
విదేశీ విద్యార్థినిపై రవి రంజన్ అత్యాచారానికి యత్నించిన విషయం తెలుసుకున్న వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ల లీడర్లు శనివారం ఉదయాన్నే పెద్ద ఎత్తున మెయిన్ గేట్ వద్ద బైఠాయించి వర్సిటీ వీసీ, ప్రొఫెసర్ రవి రంజన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని, విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగడంతో రిజిస్ట్రార్ దివేశ్ నిగం అక్కడికి చేరుకొని స్టూడెంట్స్‌తో మాట్లాడారు. రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో, స్టూడెంట్స్ ఆందోళన విరమించారు.
ప్రొఫెసర్‌పై గతంలోనే మూడు కేసులు!
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రవి రంజన్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థిని స్టేట్మెంట్ను రికార్డు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఏసీపీ రఘునందన్ తెలిపారు. రవి రంజన్ గతంలో పోలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వర్సాలో పని చేశాడు. 2018లో హెచ్‌సీయూకు వచ్చాడు. అతడిపై గతంలో మూడు కేసులు ఉన్నట్లు తెలుస్తున్నది.