
హైదరాబాద్, వెలుగు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏపీకే మోసాల గురించి కస్టమర్లను అప్రమత్తం చేసింది. ‘‘మోసగాళ్ళు బ్యాంక్ లేదా ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, కేవైసీ అప్‌డేట్, ట్రాఫిక్ జరిమానా, ట్యాక్స్ రిఫండ్ నెపంతో నకిలీ ఏపీకే లింక్‌లను పంపి ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు.
ఇది ఫోన్‌పై పూర్తి నియంత్రణ, డేటా దొంగతనం, అనధికార లావాదేవీలకు దారితీస్తుంది” అని వివరించింది. ఈ మోసాల నుంచి రక్షణ పొందేందుకు అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, నమ్మదగ్గ యాంటీవైరస్‌ను ఉపయోగించాలని సలహా ఇచ్చింది.
అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలని పేర్కొంది. మోసాలను https://sancharsaathi.gov.in లేదా 1930 హెల్ప్‌లైన్‌లో రిపోర్ట్ చేయొచ్చు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు వంటి బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసం జరిగితే, చెల్లింపు ఛానెల్‌లను బ్లాక్ చేసి, https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సలహా ఇచ్చింది.