HDFC బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. రూ.500 లోపు UPI చెల్లింపులపై SMS అలర్ట్స్ బంద్

HDFC బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. రూ.500 లోపు UPI చెల్లింపులపై SMS అలర్ట్స్ బంద్

HDFC బ్యాంక్ ఖాతాదారులకు సదరు బ్యాంకు కీలక విషయాన్ని వెల్లడించింది. 2027 జనవరి 1 నుంచి రూ.500 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో చేసే UPI లావాదేవీలకు SMS అలర్ట్స్ పంపేది లేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రూ.10, రూ.100, రూ.500 వంటి చిన్న మొత్తాలతో UPI చెల్లింపులు చేసినా.. ఎంత తక్కువ మొత్తంలో యూపీఐ పేమెంట్స్ చేసినా HDFC కస్టమర్లకు డబ్బు డెబిట్ అయిన వెంటనే మొబైల్‌కు SMS వస్తోంది. అయితే.. జనవరి 1, 2027 నుంచి 5 వందలకు పైన చేసే యూపీఐ పేమెంట్స్కే ఇలా SMS అలర్ట్స్ వస్తాయని HDFC స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ నిబంధనల్లో మార్పులు చేయడమే ఇందుకు కారణం. 2026 జూన్ 24న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, రూ.500 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు SMS ద్వారా తక్షణ సమాచారం అందించడం తప్పనిసరి.

రూ.500 లేదా అంతకంటే తక్కువ మొత్తాలకు SMS పంపాలా వద్దా అనే విషయంలో నిర్ణయాన్ని RBI బ్యాంకులకే వదిలివేసింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని HDFC బ్యాంక్ రూ.500 పైగా యూపీఐ పేమెంట్స్కే SMS అలర్ట్స్ పంపాలని డిసైడ్ అయింది.

అయితే SMS అలర్ట్స్ నిలిచిపోయినా ఖాతాదారులకు ఈ-మెయిల్ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయి. UPI చెల్లింపు ఎంత మొత్తంలో చేసినా ఈ-మెయిల్కు లావాదేవీ వివరాలు పంపిస్తారు. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. అందువల్ల.. ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఈ-మెయిల్ ఐడీని చెక్ చేసుకోవడం బెటర్.

అది పనిచేయకపోయినా లేదా మారిపోయినా HDFC నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా బ్యాంకు శాఖ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలి. మరోవైపు, ఈ నిర్ణయం వల్ల UPI చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదు. డబ్బు పంపడం, స్వీకరించడం, రోజువారీ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. వినియోగదారులు తమ UPI యాప్‌లో ట్రాన్షాక్షన్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు.