సరైన సమయంలో రాణించడమే కీలకం

సరైన సమయంలో రాణించడమే కీలకం

పూణె: ఇంగ్లండ్‌తో వన్డేల సిరీస్‌‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన భారత్.. 66 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్‌‌లో ఓపెనర్ల్ శిఖర్ ధవన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌‌తోపాటు కృనాల్ పాండ్యా అద్భుతంగా ఆడారు. బౌలింగ్‌‌లో శార్దూల్ ఠాకూర్‌‌కు తోడుగా అరంగేట్ర ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ మెరిశాడు. కొన్నాళ్లుగా సరైన ఫామ్‌‌లో లేని ఓపెనర్ ధవన్ (98) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా.. టీమ్‌కు కావాల్సిన ఆరంభాన్ని అందించడం విశేషం. దీంతో భారీ స్కోరుకు బాటలు పడినట్లయింది. ఈ నేపథ్యంలో ధవన్‌‌ను కోహ్లీ మెచ్చుకున్నాడు. 

కఠిన పరిస్థితుల్లో ధవన్ ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిదని కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో రాణించడమే నిజమైన సవాల్ అన్నాడు. ‘శిఖర్ ఇన్నింగ్స్‌‌ గురించి మాట్లాడకుండా ఉండలేం. కేఎల్ కూడా అమూల్యమైన పరుగులు చేశాడు. స్వార్థం లేకుండా టీమ్ కోసం ఆడేవారిని మేం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాం. ప్రతి స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఇది భారత క్రికెట్‌‌కు చాలా మంచి విషయం. మేమిప్పుడు సరైన దారిలో ఉన్నాం. మా దగ్గర పుష్కరమైన వనరులు ఉన్నాయి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.