- తీవ్రంగా గాయపడిన బాధితురాలు..ఉస్మానియాలో చికిత్స
- పోలీసుల అదుపులో నిందితుడు
బషీర్ బాగ్, వెలుగు : ప్రేమించాలని ఓ వివాహితను అతను ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఓల్డ్‌సిటీలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న ఎస్ఆర్టీ కాలనీలో బ్యూటీషియన్ శ్రావ్య(24) తన తల్లితో కలిసి ఉంటోంది. శ్రావ్యకు 2019లో పెండ్లి జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హరిబౌలికి చెందిన మణికంఠ, శ్రావ్య చిన్ననాటి స్నేహితులు, బంధువులు.
భర్త నుంచి దూరంగా ఉంటున్న శ్రావ్యకు దగ్గర కావడానికి మణికంఠ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని పలుమార్లు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. తనకు ఇష్టం లేదని శ్రావ్య చెప్పినా వినలేదు. దీంతో మణికంఠ ఆమెపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం శ్రావ్య తల్లి ఎప్పటిలాగే డెంటల్హాస్పిటల్లో డ్యూటీకి వెళ్లింది. ఆ తర్వాత శ్రావ్య ఇంటికి చేరుకున్న మణికంఠ లోపల నుంచి తలుపు గడియ వేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతితో గొడవకు దిగాడు. మాట్లాడుతూనే శ్యావ్యపై దాడిచేసి కొట్టాడు.
బాధితురాలి అరుపులు విన్న స్థానికులు, ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టి శ్రావ్యపై మణికంఠ దాడిచేస్తున్నట్లు గుర్తించారు. ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న శ్రావ్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మణికంఠను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. శ్రావ్య కంట్లో నుంచి రక్తం వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
