NILAKANTA Teaser: యాక్షన్ మోడ్‌లో మాస్టర్ మహేంద్రన్: 'నీలకంఠ' టీజర్ రిలీజ్.. స్నేహ ఉల్లాల్ స్పెషల్ ఎంట్రీ!

NILAKANTA Teaser: యాక్షన్ మోడ్‌లో మాస్టర్ మహేంద్రన్: 'నీలకంఠ' టీజర్ రిలీజ్.. స్నేహ ఉల్లాల్ స్పెషల్ ఎంట్రీ!

NILAKANTA Movie: ‘పెద్దరాయుడు’ సినిమాలో తన అమాయకత్వంతో, “నేను చూశాను తాతయ్య!” అనే ఒక్క డైలాగ్‌తో థియేటర్లను హోరెత్తించిన ఆ చిన్నారి గుర్తున్నాడా? ఆ మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు పక్కా కమర్షియల్ హీరోగా మన ముందుకు వస్తున్నాడు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ విజయ్ ‘మాస్టర్’ సినిమాలో యంగ్ విజయ్ సేతుపతిగా తన నట విశ్వరూపాన్ని చూపించిన మహేంద్రన్.. ఇప్పుడు ‘నీలకంఠ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

బాలనటుడి నుండి యాక్షన్ హీరోగా..

మాస్టర్ మహేంద్రన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బాలనటుడిగా వందలాది సినిమాల్లో నటించిన అతను.. ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా విడుదలైన ‘నీలకంఠ’ టీజర్ చూస్తుంటే మహేంద్రన్ ఈసారి గట్టి కలెక్షన్స్ వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని టీజర్ స్పష్టం చేస్తోంది.

లేటెస్ట్ గా విడుదలైన ‘నీలకంఠ’ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. శ్రవణ్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, సినిమాటిక్ ఫీల్‌తో ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ బిజె అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణం పోసింది. యాక్షన్ సన్నివేశాల్లో సంగీతం హైలెట్‌గా నిలిచిందని చెప్పుకోవాలి. ఈ చిత్రంలో మహేంద్రన్ సరసన యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఒకప్పటి గ్లామర్ క్వీన్ స్నేహ ఉల్లాల్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం విశేషం.

న్యూ ఇయర్ కానుకగా జనవరి 2న విడుదల..

న్యూ ఇయర్ వేడుకల జోష్‌లో ఉన్న ప్రేక్షకులకు జనవరి 2న ‘నీలకంఠ’ ఒక మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. శ్రీనివాసులు, వేణుగోపాల్ సంయుక్తంగా ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్ర నిర్మాతలు రాజీ పడకుండా భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందించారు. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ పంపిణీ సంస్థ గ్లోబల్ సినిమాస్ విడుదల చేయబోతోంది. మెుత్తానికి ‘పెద్దరాయుడు’ పిల్లాడు ఇప్పుడు ‘నీలకంఠ’గా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.