పద్మను గెలిపిస్తే మెదక్​కు రింగ్​ రోడ్డు : కేసీఆర్

పద్మను గెలిపిస్తే మెదక్​కు రింగ్​ రోడ్డు : కేసీఆర్
  • ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

మెదక్, టౌన్, వెలుగు : ‘పద్మ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే మెదక్ చుట్టూ రింగు రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీలు ఆటోమెటిక్​గా వస్తాయి’ అని బీఆర్​ఎస్​ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం స్థానిక సీఎస్​ఐ గ్రౌండ్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ‘ పద్మ నాబిడ్డ అని వట్టిగ చెప్పలేదు... ఆమె కోరితే రామాయంపేట రెవెన్యూ డివిజన్​, ప్రభుత్వ డిగ్రీ కాలేజి మంజూరు చేశా’ అని చెప్పారు. వచ్చేటపుడు హెలికాప్టర్​లో నుంచి మంజీరా నదిని చూశామని, కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఎండబెట్టి, దుమ్ము లేచేది, కాల్వల్లో చెట్లు మొలిచి అధ్వాన్నంగా ఉండేవన్నారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చాక కాల్వలు బాగు చేసుకోవడంతో 40 వేల ఎకరాలు పండుతున్నాయన్నారు. ‘నెత్తిమీద కుండలా మల్లన్న సాగర్​ ఉంది. కాలేశ్వరం కాల్వల పనులు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్​ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు నీళ్లు వస్తాయి’ అన్నారు. పద్మకు, కాంగ్రెస్​ పార్టీ నుంచి నిలబడ్డ వాళ్లకు ఏమన్న పోలిక ఉందా?, దిష్టిబొమ్మను తెచ్చి నిలబెడితే ఓటేయాల్నా అని అడిగారు. బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్​ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో మెదక్ నియోజకవర్గాన్నిఎంతో అభివృద్ధి చేశానని

ఆడబిడ్డగా ఆదరించి తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెదక్ సమగ్రాభివృద్ధికి అంకితమవుతానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావ్, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్​​ రెడ్డి, జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత, ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి, మున్సిపల్​ చైర్మెన్​ చంద్రపాల్, ఏఎంసీ చైర్మెన్​ బట్టి జగపతి, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షులు సోములు, నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి తిరుపతిరెడ్డి, నాయకులు ఆంజనేయులు, జనార్ధన్​రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.