మైనర్ స్టూడెంట్‌పై అత్యాచారం.. హెడ్మాస్టర్ అరెస్ట్

మైనర్ స్టూడెంట్‌పై అత్యాచారం.. హెడ్మాస్టర్ అరెస్ట్

స్కూళ్లో విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాడు దారి తప్పాడు. అతనికి తోడుగా అతని భార్య సహకరించింది. హాస్టళ్లో ఉంటే చదువుకైనా.. రాకపోకలకైనా ఏ ఇబ్బంది ఉండదని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లో చేర్పిస్తారు. కానీ, హాస్టళ్లోనే అఘాయిత్యం జరిగితే.. అది కూడా ఏ మారుమూల ఊళ్లోనో కాదు.. రాష్ట్ర రాజధాని.. హైదరాబాద్ నగరంలో జరిగితే..

చైల్డ్ హెల్ప్‌లైన్ ద్వారా ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాటసింగారంలోని జానెట్ జార్జ్ మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కే. ప్రసాద రావు (51) మరియు అదే పాఠశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్న అతని భార్య సారథిని పోలీసులు అరెస్టు చేశారు. జానెట్ జార్జ్ మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూళ్లో 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక 2015వ సంవత్సరంలో పాఠశాలలో చేరి, అదే పాఠశాలకు చెందిన హాస్టళ్లో ఉంటున్నట్లు తెలిపింది. కొంత కాలం తర్వాత ఆమె రాత్రిపూట హాస్టళ్లో నిద్రిస్తున్నప్పుడు స్కూల్ హెడ్మాస్టర్ హాస్టల్ గదిలోకి ప్రవేశించి అత్యాచారం చేశాడని తెలిపింది. అప్పటి నుంచి వారం వారం ఇదే తంతు కొనసాగుతుందని ఆ బాలిక తెలిపింది. దీనికి తోడు అతని భార్య సారథి కూడా హాస్టళ్లో పనులు చేయాలంటూ చిత్రహింసలకు గురిచేసేదని తెలిపింది. వారి వేధింపులు భరించలేక ఈ ఏడాది జూన్‌లో హాస్టల్ నుంచి తప్పించుకున్న బాలిక.. ఇప్పటికి ధైర్యం చేసి చైల్డ్ హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హెడ్మాస్టర్ దంపతులపై పోక్సో చట్టం మరియు జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.