బాలికలకు హెల్త్ కిట్స్ అందట్లే

బాలికలకు హెల్త్ కిట్స్ అందట్లే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో చదివే బాలికలకు హెల్త్​కిట్స్​ అందడంలేదు.. ప్రతీ మూడు నెలలకు ఓసారి చొప్పున ఏటా నాలుగు సార్లు ఈ కిట్స్​ అందించాలి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్కసారి కూడా కిట్స్​ ఇవ్వలేదు. గతేడాది  ఇవ్వాల్సిన నాలుగో విడత కిట్స్​ ఇప్పుడు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సర్కార్​ బడుల్లోని 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న బాలికల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ‘బాలికల ఆరోగ్య రక్ష కిట్’ పథకాన్ని గతేడాది ప్రారంభించింది.  రూ.420 విలువ గల ఈ కిట్ లో 15 రకాల వస్తువులను అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లతో పాటు మోడల్‌‌ స్కూల్స్‌‌, కేజీబీవీల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు ఆరు లక్షల మంది గర్ల్స్‌‌కు హైజిన్‌‌ కిట్స్‌‌ అందించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏటా నాలుగు విడుతల్లో కిట్స్​ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఆదిలోనే హంసపాదన్నట్లు.. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్స్‌‌ ఇప్పటికీ విద్యార్థినులకు అందనేలేదు. కొన్ని జిల్లాల్లో మూడు విడతలు, మరికొన్ని జిల్లాల్లో రెండు విడతల్లో కిట్స్​ అందించారు.

ఈ ఏడాది దిక్కే లేదు

ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై 5 నెలలు దాటినా ఇప్పటికీ కిట్స్‌‌ పంపిణీ ప్రారంభం కాలేదు. గతేడాది నాలుగో విడతకు సంబంధించిన కిట్లను అధికారులు ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కేవలం నాలుగైదు జిల్లాల్లోనే పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదు. కోర్టు కేసులు, నిధుల కొరత వల్లే కిట్స్‌‌ పంపిణీ ఆలస్యమైందని అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని విద్యాసంస్థలకు గతేడాది కోటాను పూర్తిగా ఇస్తామన్నారు. ఈ విద్యాసంవత్సరం కిట్స్‌‌ ఎప్పుడు ఇస్తారో అధికారుల్లోనూ క్లారిటీ లేదు.

ఇంటి నుంచే వస్తువులు

హైజీన్‌‌ కిట్స్ అందక కేజీబీవీ, మోడల్‌‌ స్కూల్స్‌‌ విద్యార్థినులు ఇంటి నుంచే సామాన్లు తెచ్చుకుంటున్నారు. పేరెంట్స్ ఇచ్చే డబ్బులతో నెలనెలా కాస్మొటిక్‌‌ కొనుక్కుంటున్నారు. ఒక్కోనెల పేరెంట్స్‌‌ రాకపోతే, వారంతా ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. గతంలో ఇచ్చినట్లు ఇప్పుడు కూడా కాస్మొటిక్‌‌ చార్జీలు ఇవ్వడమే బెటర్‌‌ అని స్టూడెంట్లు చెబుతున్నారు.