
Tesla Cars: భారతదేశంలో ప్రజలు ఈవీ వాడకాల వైపు వేగంగా కదులుతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో పాటు చట్టాల మార్పుల కారణంగా చాలా మంది గ్రీన్ మెుబిలిటీ వైపు మారేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా దిగ్గజ ఈవీ మేకర్ టెస్లా తన మెుదటి షోరూం ముంబైలో నేడు ప్రారంభించింది.
ప్రస్తుతం టెస్లా తన మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ స్టార్టింగ్ మోడల్ ఎక్స్ షోరూం ధరను రూ.59 లక్షల 89వేలుగా ఉంచగా.. ఇందులోనే లాంగ్ రేంజ్ వేరియంట్ ఆన్ రోడ్ ధరను రూ.67లక్షల 89వేలుగా తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. వాస్తవానికి ఇండియాలో అమ్ముతున్న టెస్లా కార్లను సంస్థ చైనాలోని తన గిగా ఫ్యాక్టరీలో తయారు చేసి దిగుమతి చేస్తోంది.
ఇక్కడ భారతీయ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే ఇవే మోడల్ కార్లు అమెరికా, చైనా, జర్మనీల్లో దాదాపుగా సగం రేటుకే అందుబాటులో ఉండటం. దీనికి ప్రధాన కారణం.. భారత ప్రభుత్వం 40వేల డాలర్ల కంటే విలువైన ఈవీ కార్ల దిగుమతులపై 70 శాతం నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించటమే. అయితే దీనిని భారీగా తగ్గించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి కొనసాగుతోంది. అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా ఈవీల ధరలు ఇతర దేశాల్లో కంటే చాలా ఎక్కువగా ఉండటం భారతీయ కొనుగోలుదారులను కొంత నిరాశకు గురిచేస్తోంది.
చైనాలో సగం రేటుకే టెస్లా.. ఇతర దేశాల్లో రేట్లిలా..
టెస్లా వై మోడల్ ప్రారంభ ధర అమెరికాలో 45వేల డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే దీని ధర దాదాపు రూ.38 లక్షలుగా ఉంది. ఇదే కార్ రేటు చైనాలో 2లక్షల 63వేల 500 యువాన్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో కారు రేటు చైనాలో రూ.28 లక్షల 33వేలు. ఇదే కారు రేటు జర్మనీలో 45వేల 970 యూరోలుగా ఉంది. భారక కరెన్సీలోకి దీనిని కన్వర్ట్ చేస్తే రేటు రూ.46 లక్షలని తేలింది. ఇక లాంజ్ రేంజ్ వేరియంట్ ఇండియాలో రూ.70 లక్షలుగా ఉండగా చైనాలో రూ.34 లక్షలుగా విక్రయించబడుతోంది. ప్రస్తుతం పన్నుల కారణంగా టెస్లా కార్లు టాటా, మహీంద్రా వంటి సంస్థలతో పోటీ పడకుండా బీఎండబ్ల్యూ, ఆడి, బెండ్ వంటి సంస్థల కార్లతో పోటీ పడుతోందని తేలింది.
టెస్లా మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇదే క్రమంలో లాంగ్ రేంజ్ ఆర్డబ్యూడీ మోడల్ 622 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అలాగే ఇవి కేవలం 15 నిమిషాల పాటు చార్జ్ చేస్తే మెుదటి మోడల్ 238 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ మోడల్ 267 కిలోమీటర్లు అదనపు మైలేజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. అలాగే కేవలం 6 సెకన్లలోపే ఈ కార్లు 100 కిలోమీటర్ల స్పీడును అందుకోగలవని వెల్లడైంది.
ప్రస్తుతం కంపెనీ ఈ కార్లను ఇండియాలో 6 రంగుల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రే, పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ, క్విక్ సిల్వర్, అల్ట్రా రెడ్ రంగుల్లో కార్ అందుబాటులో ఉంటాయి.