
- యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- వచ్చే నెల 30 దాకా ఇంటింటికీ వెళ్లి టెస్టులు
- 13 రకాల రోగాలు గుర్తించి, నయం చేయడమే లక్ష్యం
- కోటి కుటుంబాలకు స్క్రీనింగ్ చేసే అవకాశం
- ఉత్తర్వులిచ్చిన ‘ఆరోగ్య’ కమిషనర్ యోగితా రాణా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కుష్టు, టీబీ, పాలియేటివ్ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల రోగాలను గుర్తించి, వాటిని నయం చేసేందుకు యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. బుధవారం ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా అన్ని జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటింటికి వెళ్లి..
ఈనెల 26 నుంచి వచ్చే నెల 30 వరకు స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు రోజూ గ్రామాల్లో ఉదయం 6 నుంచి 9.30 వరకు ఇంటింటికీ తిరిగి పరీక్షలు చేస్తారు. ఇద్దరు చొప్పున ఒక టీమ్‌గా ఏర్పడి, పని చేయాల్సి ఉంటుంది. రోజూ 20 ఇళ్లకువెళ్లి స్క్రీనింగ్ చేయాలి. వీరు డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపుల సహకారం తీసుకుంటారు. దాదాపు కోటి కుటుంబాలను ఈ సందర్భంగా కలిసే అవకాశముంది. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో పరీక్షలు చేసి ప్రతిరోజు సంబంధిత రిపోర్ట్‌ను జిల్లా కార్యాలయానికి పంపించాలి. అదే రిపోర్టును రోజూ విలేజ్ హెల్త్ సర్వీస్ యాప్‌లో నమోదు చేయాలి. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అని పేర్కొంటున్నా.. ఈ కార్యక్రమంలో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతున్నట్లు కనిపించడంలేదని వైద్యాధికారులు అంటున్నారు.