డ్యూటీకి రాని.. 94 మంది డాక్టర్లపై వేటు..

డ్యూటీకి రాని.. 94 మంది డాక్టర్లపై వేటు..
  • 88 అసిస్టెంట్, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగించిన డీఎంఈ
  • నోటీసులిచ్చినా బేఖాతరు

ఏండ్ల తరబడి హాస్పిటల్స్ ముఖం చూడని 88 మంది అసిస్టెంట్, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 94 మందిపై వైద్యారోగ్య శాఖ కొరడా ఝళిపించింది. అన్​ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కింద విధులకు రాని వారిని డిస్మిస్  చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    
హైదరాబాద్, వెలుగు: పేదలకు వైద్యం అందించాల్సిన బాధ్యతను గాలికొదిలేసి ఏళ్ల తరబడి హాస్పిటల్స్ ముఖం చూడని 88 అసిస్టెంట్, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 94 మందిపై  వైద్యారోగ్య శాఖ కొరడా ఝళిపించింది. అనాఆథరైజ్డ్  ఆబ్సెంట్ కింద ఏళ్ల తరబడి విధులకు రాని వారిని డిస్మిస్  చేస్తూ డైరెక్టర్  ఆఫ్  మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్  ఎ.నరేంద్ర కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ మెడికల్  కాలేజీలు, ఆసుపత్రుల్లో పనిచేస్తూ ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న మొత్తం 115 మందిని డీఎంఈ గుర్తించింది. వీరందరికీ ఇదివరకే పలుమార్లు షోకాజ్  నోటీసులు ఇచ్చారు. అయినా చాలా మంది వాటిని కనీసం పట్టించుకోలేదు. మరికొందరు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవు. దీనిపై త్రిసభ్య కమిటీ వేసిన డీఎంఈ.. 115 మందిలో 94 మందిని సర్వీస్  నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

2018 నుంచే పత్తాలేరు..

వేటుపడిన వారిలో కొందరు 2018, 2020 నుంచే విధులకు రావడం లేదు. ఆసిఫాబాద్  మెడికల్  కాలేజీకి చెందిన ఓ అనస్థీషియా డాక్టర్  2018 జూన్ నుంచి, నిలోఫర్‌‌‌‌లో ఓ డాక్టర్ 2020 డిసెంబరు నుంచి విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా గైర్హాజరైతే సర్వీసు నుంచి తొలగించే అధికారం ఉంది. కానీ, అధికారులు ఏకంగా ఎనిమిదేళ్లుగా వారిని ఉపేక్షించారు. నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ... ఆ పోస్టులను బ్లాక్  చేసి ఉంచడం వల్ల కొత్త వారిని నియమించుకునే అవకాశం కోల్పోయారు. 

కీలక డిపార్ట్ మెంట్లలోనే డుమ్మాలు..

పేట్లబుర్జు, సుల్తాన్ బజార్  వంటి మెటర్నిటీ హాస్పిటల్స్ లోనే గైనకాలజీ డాక్టర్లు, నిలోఫర్‌‌‌‌లో పీడియాట్రిక్  డాక్టర్లే అత్యధికంగా విధులకు ఎగనామం పెట్టారు. ఉస్మానియా, గాంధీ వంటి హాస్పిటల్స్ లో అనస్థీషియా, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ల నిపుణులు కూడా ఏళ్ల తరబడి పత్తాలేరు. జిల్లాల్లోనూ రేడియాలజీ, జనరల్  మెడిసిన్  వంటి కీలక డిపార్ట్ మెంట్ల వారే విధులను గాలికొదిలేయడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు.

కొత్త వారికి లైన్ క్లియర్...

పనిచేయని వారిని భరించడం వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని భావించిన సర్కారు.. అలాంటి వారిని సాగనంపి, ఆ ఖాళీలను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే 690కి పైగా అసిస్టెంట్  ప్రొఫెసర్  పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉండగా... తాజాగా ఖాళీ అయిన ఈ 94 పోస్టులను కూడా కలుపుకునే చాన్స్  ఉంది.