రోగులను ప్రైవేటుకు పంపిస్తే డాక్టర్లపై చర్యలు

రోగులను ప్రైవేటుకు పంపిస్తే డాక్టర్లపై చర్యలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో అందుబాటులో ఉండే మందుల వివరాలతో ఆరోగ్య శాఖ బుక్‌‌‌‌లెట్స్‌‌‌‌ ప్రింట్ చేయిస్తున్నది. ఇందులో ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌‌‌, అడిషనల్ ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌‌‌, డ్రగ్స్ పేరిట మూడు విభాగాలు ఉండనున్నట్టు తెలిసింది. ఈ బుక్‌‌‌‌లెట్లను ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసే డాక్టర్లు అందరికీ ఇవ్వనున్నారు. అలాగే, అవుట్ పేషెంట్, ఇన్‌‌‌‌ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అన్ని రోగాలకు అవసరమైన, అన్ని రకాల మందుల పేర్లు ఇందులో ప్రింట్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బుక్‌‌‌‌లెట్‌‌‌‌లోని మందులనే రోగులకు రాయాలని డాక్టర్లను ఆదేశించనున్నారు. మెడిసిన్ రాసేటప్పుడు జనరిక్ పేరు తప్పితే, బ్రాండ్ పేరు రాయొద్దన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిబంధనను తప్పకుండా పాటించాలన్నారు. కాంబినేషన్స్ రాసేటప్పుడు కూడా జనరిక్‌‌‌‌ పేరుతోనే రాయాలని డాక్టర్లకు సూచించనున్నారు. రోగులను ప్రైవేటుకు పంపిస్తే, డాక్టర్లపై చర్యలు ఉంటాయని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

ఫార్మసిస్టులపైనా నిఘా.. 
ఫార్మసీలోని మందులను పక్కదారి పట్టించడం, మందులు ఉన్నా లేవని చెప్పడం, ఫార్మసీలో అందుబాటులో ఉండకపోవడం, టైమింగ్స్ కంటే ముందే ఫార్మసీని క్లోజ్ చేయడం, డాక్టర్లు రాసిన మందులు పూర్తి కోర్సుకు సరిపడా ఇస్తున్నారా లేదా  వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తప్పు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏయే మందులు ఉన్నాయో తెలిసేలా, ఫార్మసీ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.