
- ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
- డీ వార్మింగ్ పేరుతో కార్యక్రమం
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆరోగ్య శాఖ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి అల్బెండజోల్ ట్యాబ్లెట్లు పంపిణీ చేయడానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏండ్ల వయస్సున్న వారిలో నులి పురుగుల నివారణకు ఈ మాత్రలు వేస్తారు. ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్లోని మాడపాటి హనుమంత రావు గర్ల్స్ హైస్కూల్లో ప్రారంభించనున్నారు. నిరుడు 96.47 లక్షల మందికి ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈసారి సుమారు 99 లక్షల మందికి పంపిణీ చేసే అవకాశం ఉంది.
అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కూల్ బయట ఉన్న పిల్లలకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్ల సాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఇప్పటికే 41,337 మంది టీచర్లకు, 35,700 మంది అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు. గురువారం ఏదైనా కారణంతో ట్యాబ్లెట్లు తీసుకోలేకపోయిన పిల్లల కోసం ఈనెల 27న మరోసారి ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఎందుకీ ట్యాబ్లెట్స్?
పిల్లల శరీరాల్లోకి వివిధ మార్గాల ద్వారా నులి పురుగు లు చేరుతాయి. అపరిశుభ్ర ప్రాంతాల్లో చెప్పుల్లేకుండా నడవడం, కలుషితమైన నీరు తాగడం, ఆహారం తినడం, చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవడంతో ఇవి పిల్లల బాడీలోకెళ్తాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇవి పొట్టలోకి చేరి.. రక్తహీనత, శారీరక, మానసిక ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఈ సమస్యల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు ఏటా దేశవ్యాప్తంగా ‘డీ వార్మింగ్ డే’ ను నిర్వహిస్తున్నారు. తీపి పదార్థాలు తినాలనే కోరిక పెరగడం, కడుపు నొప్పి, ఆకలి వంటివి నులిపురుగులున్నాయనడానికి సంకేతాలని డాక్టర్లు చెబుతున్నారు.