- కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది
- కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం
- పార్లమెంట్‌లో చర్చ జరపాలని సూచన.. అంగీకరించిన అధికారపక్షం
న్యూఢిల్లీ: దేశంలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఎయిర్ పొల్యూషన్‌తో కొట్టుమిట్టాడుతున్నాయని, కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని తెలిపారు. ఈ సమస్యపై పార్లమెంట్‌లో రాజకీయాలకతీతంగా చర్చించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎయిర్ పొల్యూషన్‌పై కూలంకషంగా చర్చించి ఓ ప్లాన్రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘‘మన ప్రధాన నగరాల్లో చాలావరకు విషపూరిత గాలి ముసుగు కింద జీవిస్తున్నాయి. లక్షలాది మంది పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. వారి భవిష్యత్తు నాశనం అవుతున్నది. ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వృద్ధులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై తమకు, అధికారపక్షానికి ఏకాభిప్రాయం ఉండాలని నేను అనుకుంటున్నా” అని వ్యాఖ్యానించారు. ప్రతి మెట్రో నగరానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసేందుకు ప్రధాని ముందుకు రావాలని రాహుల్ సూచించారు.
చర్చకు సిద్ధమే: కిరణ్ రిజిజు
రాహుల్‌గాంధీ లేవనెత్తిన పొల్యూషన్ సమస్యపై చర్చకు అధికార పక్షం సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ దీనికి సమయం కేటాయించవచ్చని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం బిజినెస్ అడ్వైజరీ కమిటీ దృష్టికి వచ్చింది. మొదటి రోజు నుంచి ప్రతిపక్షాల సూచనలను తీసుకొని అన్ని ముఖ్యమైన విషయాలను చర్చించడానికి, పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ చర్చను ఎలా చేపట్టవచ్చో పరిశీలిస్తాం” అని సమాధానమిచ్చారు.
రాహుల్, ప్రియాంకను ఒకరితో ఒకరిని పోల్చలేం: రేణుకా చౌదరి
రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ప్రసంగాల శైలివిభిన్నంగా ఉంటాయని, వారిని ఒకరితో మరొకరిని పోల్చలేమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. కొంతమంది రాహుల్ గాంధీ అవకాశాన్ని వృథా చేస్తున్నారని, ప్రియాంకా గాంధీ సభను ఆకట్టుకుంటున్నారని అభిప్రాయపడ్డ నేపథ్యంలో రేణుకా చౌదరి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.
రాహుల్, ప్రియాంక ఆపిల్, ఆరెంజెస్ లాంటివారని అభివర్ణించారు. వారిద్దరూ తమ అభిప్రాయాలపై గట్టిగా నిలబడతారని, తప్పనిసరైన వాటిని లేవనెత్తుతారని తెలిపారు. ఒకరితో మరొకరికి పోలిక వద్దని సూచించారు.

