బయట దొరికే బాయిల్డ్ ఎగ్‌ తింటున్నారా? జర జాగ్రత్త

బయట దొరికే బాయిల్డ్ ఎగ్‌ తింటున్నారా? జర జాగ్రత్త

రోజూ గుడ్డు  తింటే  మంచిది. కానీ  బయట ఉడకబెట్టిన  గుడ్డు  తింటున్నారా..?  అయితే  జర జాగ్రత్త.. తినే  ముందు కాస్త  ఆలోచించండి. అందులో ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుందని ఆహార భద్రత నిపుణులు   హెచ్చరిస్తున్నారు. టైమ్ లేదనో, బిజీ లైఫ్‌లో ఎందుకు కష్టపడటం అనుకుంటే  అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

బిజీ లైఫ్ కు అలవాటు పడిన వారు చాలామంది ఇంట్లో వండుకోవడం మానేశారు. ఒకవేళ చేసుకున్న అది ఎలక్ట్రిక్‌ కుక్కర్‌‌లో రైస్ పెట్టడంతోనే సరి పోతోంది. వీధికో కర్రీ పాయింట్  ఉండటంతో కూరలు అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు. కొందరైతే స్మార్ట్ ఫోన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు. ఇలా బయటి తిండి అప్పడుప్పుడు అయితే ఫర్వాలేదు గానీ, ప్రతి రోజూ అయితే చాలా డేంజర్ అంటున్నారు ఆహార భద్రతా నిపుణులు. ఈ మధ్య కాలంలో ఉడక పెట్టిన గుడ్లు మెస్, కర్రీ పాయింట్స్, హోటల్స్‌లోనూ పెట్టి అమ్ముతున్నారు. 
వీటికి అలవాటు పడితే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

కారణం ఇదే..

బయట అమ్మే ఉడకబెట్టిన గుడ్లల్లో సూడో మోనాస్ బ్యాక్టీరియా ఉంటుందని ఆహార భధ్రత నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువగా నిల్వ ఉండవు. అలా ఉండేవి పాడైపోతాయనీ, వాటిల్లో సూక్ష్మజీవులు ఉంటాయని అంటున్నారు. డాక్టర్లు కూడా ఇదే హెచ్చరిస్తున్నారు. గుడ్డు తింటే మంచిదే కానీ.. బయట దొరికే ఉడకబెట్టిన వాటిని తినడం అస్సలు మంచిది కాదంటున్నారు. వాటిని ఎప్పుడు ఉడకపెడతారో తెలియదు... అమ్ముడు పోకపోతే... తెల్లారి కూడా అమ్ముతుంటారు. అప్పుడు వాటిపై బ్యాక్టీరియా చేరే ఛాన్స్ ఉందంటున్నారు. 

ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..?

పెచ్చులూడిన గుడ్డుని కొనుక్కోకపోవడం బెటర్.. కోడి గుడ్లు వండటానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాడైన లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లను ఈజీగా గుర్తించవచ్చు. దాని టేస్ట్ తోపాటు వాసన కూడా మారుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్డు తింటే వాంతులు, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, జ్వరం రావడంతో పాటు... కొన్నిసార్లు ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బయట కొనుక్కొని తినడంతో అనారోగ్యాన్ని కూడా కొనుక్కున్నట్లేనని అంటున్నారు. పాతది లేదా చెడిపోయిన ఆహారాన్ని కూడా ఉడికించవద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. దెబ్బతిన్న భాగాన్ని తీసేసి మిగిలిన భాగాన్ని వండటం కూడా ఎప్పుడూ చేయొద్దంటున్నారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.