జామ ఆకులో ఆరోగ్యం!!

జామ ఆకులో ఆరోగ్యం!!

ప్రకృతి వైద్యంలో పండ్లతోపాటు చెట్టుకు సంబంధించిన ప్రతీది వాడతారు. పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో, అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఆకుల్లో కూడా ఉంటాయట. ‘పేదోడి యాపిల్​’గా చెప్పుకునే జామపండు చేసే మేలు గురించి మనందరికీ తెలుసు. మరి జామ ఆకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందనే విషయం మీకు తెలుసా?  రోజూ ఓ యాపిల్​ తింటే డాక్టర్​ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. కానీ.. రోజూ యాపిల్​ తినడం అందరికీ సాధ్యం కాదు.

యాపిల్​ కాస్త కాస్ట్​లీ కదా! కనీసం 30 రూపాయలు పెడితేకానీ ఓ యాపిల్​ను కొనలేం. మరి అదే 30 రూపాయలతో కిలో జామపండ్లను కొనుక్కోవచ్చు. పైగా యాపిల్​తో పోలిస్తే జామపండ్లతో ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అందుకే జామపండును ‘పేదోడి యాపిల్​’ అంటారు. అయితే జామపండు, దానిలో ఉండే పోషకాలు, తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలిసిందే. కానీ.. జామపండుతో సమానంగా జామ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నిజంగా ఈ ప్రయోజనాల గురించి అందరికీ తెలిస్తే.. పండ్లే కాదు, జామ ఆకులు కూడా కొనుక్కోవాల్సిన రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నవి తింటే.. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే జామ ఆకులో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అందుకే జామపండు కంటే జామ ఆకులోనే ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు న్యూట్రిషన్స్​. నొప్పులు, వాపులను తగ్గించే ఔషధ గుణాలు జామ ఆకులో ఉన్నాయి. జలుబు, దగ్గు, ఊపిరి సమస్యలు, పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటిపూత లాంటి ఎన్నో సమస్యలను నయం చేస్తుంది. అంతేకాదు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.

కారణమేంటంటే.. జామ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్​–సితోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్వర్సిటిన్, ఫ్లవనోల్ మంచి ఫ్లెవనాయిడ్స్ జామ ఆకులో ఉంటాయి. పొటాషియం, ఫైబర్ కూడా జామ ఆకులో ఎక్కువే. ఇవన్నీ ఉన్నందునే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

బ్లడ్ షుగర్‌‌‌‌ కంట్రోల్​లో ఉంటుంది..

జామ ఆకుల రసం తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తిన్న తర్వాత ఓ కప్పు జామ ఆకు టీ తాగితే షుగర్​కు సంబంధించిన అన్నిరకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ టీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే. ఈ కాస్త వగరుగా ఉన్నా.. ఆరోగ్యానికి చేసే అంతాఇంతా కాదు. మార్కెట్​లో జామ ఆకుల టీపొడి కూడా లభిస్తోంది. అయితే నేచురల్​గా ఆకులను మరగబెట్టుకొని తాగడమే బెటర్​.

హార్ట్​కు మంచిది..

జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రక్తంలోని విషపదార్థాలను (టాక్సిన్​) బయటకు పంపేస్తాయి. అంతేకాదు పొటాషియం, డైటరీ ఫైబర్​ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్​ పెరిగేలా చేస్తాయి. గుండె జబ్బులకు దారితీసే హైబీపీని తగ్గించడంలో జామ ఆకుల కషాయం ది బెస్ట్​ అని చెప్పొచ్చు.

పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి..

పీరియడ్స్ టైమ్‌‌లో చాలా మంది మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నొప్పి తగ్గాలంటే జామ ఆకుల రసం తాగాలి. లేదంటే టీ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్​ టైంలోనే కాకుండా రోజూ తాగితే మరింత మంచిది.

అరుగుదల పెరుగుతుంది.. 

జామపండ్లు తింటే అరిగించుకునే కెపాసిటీ పెరుగుతుందని తెలుసు. కారణం.. జామపండులో ఫైబర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. అయితే జామపండు కంటే కూడా జామ ఆకులో డైటరీ ఫైబర్​ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ ఆకుల రసం తాగినా జీర్ణశక్తి పెరుగుతుంది.

ఐదారు ఆకుల నుంచి రసాన్ని తీసి తాగితే శరీరానికి అవసరమయ్యే ఫైబర్​లో 12 శాతం భర్తీ అవుతుంది. అంతేకాదు.. అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుంటే జామ ఆకులతో చేసిన టీ తాగిస్తే వెంటనే ఆగిపోతాయి. అంతేకాదు.. బాడీ డీహైడ్రైడ్​ కాకుండా ఉంటుంది.

క్యాన్సర్​ రాకుండా అడ్డుకుంటుంది..

క్యాన్సర్ వస్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే. అయితే క్యాన్సర్​ రాకుండా ఉండాలంటే రోజూ జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగాలి. ఎందుకంటే.. జామ ఆకుల్లో క్యాన్సర్​ను రాకుండా చేసే గుణాలున్నాయి. అంతేకాదు క్యాన్సర్​ కణాల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్​ రోగులు వాడుతున్న మందుల సైడ్​ఎఫెక్ట్స్​ తగ్గాలన్నా జామ ఆకులతో చేసిన టీ తాగాలి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది..

జామ ఆకుల్లో విటమిన్–సి ఎక్కువగా ఉంటుంది. ఇది జబ్బులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సి–విటమిన్ కంటే డబుల్​ జామకాయను తింటే లభిస్తుంది. వ్యాధులు రాకుండా ఉండాలంటే తరచూ జామ ఆకులతో చేసిన టీ తాగాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

చర్మానికి మేలు ..

బయటి కాలుష్యం వల్ల చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. నల్లబడడం, మచ్చలు, డెడ్​సెల్స్​ పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే జామ ఆకులతో చేసిన పేస్ట్​ను స్ర్కబ్బర్​లా వాడాలి. దీనివల్ల చర్మానికి అవసరమైన అన్ని పోషకాలు అందడంతోపాటు శుభ్రపడుతుంది కూడా.

బరువు తగ్గొచ్చు..

జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా కేలరీలు లేని పోషకాలు అందడం వల్ల బరువు కూడా తగ్గుతారు.