స్టెమ్ సెల్ ల్యాబ్‌‌తో.. తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం

స్టెమ్ సెల్ ల్యాబ్‌‌తో.. తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం
  • నిమ్స్‌‌లో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో స్టెమ్ సెల్(మూల కణాలు) థెరపీకి లక్షల రూపాయలు ఖర్చవుతుండటంతో సామాన్యులు ఆ భారాన్ని మోయలేకపోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే నిమ్స్‌‌లో అత్యాధునిక స్టెమ్ సెల్ ల్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. సోమవారం నిమ్స్‌‌లో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఏర్పాటైన ఈ ల్యాబ్‌‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.

తులసి థెరప్యుటిక్స్, నిమ్స్ డాక్టర్లు కలిసి ఇక్కడ లోతైన పరిశోధనలు చేస్తారని, ఈ రీసెర్చ్ ఫలితాలతో భవిష్యత్తులో నిమ్స్‌‌లోనే పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందిస్తామన్నారు. స్టెమ్ సెల్ థెరపీని మొండి రోగాలకు సంజీవని లాంటిదని అభివర్ణించిన మంత్రి.. క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడేవారికి ఇది గొప్ప అవకాశమన్నారు.

శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా, జబ్బు చేసినా ఆ భాగాన్ని రిపేర్ చేసే అద్భుత శక్తి ఈ మూల కణాలకు ఉందని వివరించారు.‘‘ఒక పెద్ద వృక్షం పుట్టాలంటే విత్తనం ఎంత ముఖ్యమో, మన శరీరానికి స్టెమ్ సెల్స్ కూడా అంతే ముఖ్యం. విత్తనం నుంచి చెట్టు వచ్చినట్లే, ఈ కణాల నుంచి దెబ్బతిన్న అవయవాలను మళ్లీ తయారు చేసుకోవచ్చు. పేదోడికి ఈ వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం’’ అని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.