99 శాతం మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు

99 శాతం మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు

క‌రోనాకు చంపే శ‌క్తి లేద‌ని తెలిసిపోయింది:  మంత్రి ఈటల 

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడైనా క‌రోనా కి చికిత్స ఒక్కటే.. అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. న‌గ‌రంలోని ఎస్ ఆర్ నగర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ద్వారా 22 వేల మంది ఆశా వర్కర్స్, 500 మంది ఎఎన్ఎం లతో మంత్రి ఈటల ఆదివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భ‌రోసా క‌ల్పించండి – ప్రాణాలు కాపాడండి అని ఆశా వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎంల‌కు పిలుపునిచ్చారు. ఈ 6 నెల‌ల అనుభ‌వంలో క‌రోనాకు చంపే శ‌క్తి లేద‌ని తెలిసిపోయింద‌న్నారు.

క‌రోనా స‌మ‌యంలో హెల్త్ వారియ‌ర్స్ కంటి మీద కునుకు లేకుండా ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 99 శాతం మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో కూడా ప్లాస్మా థెర‌పీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచి అతి త్వ‌ర‌లోనే క‌రోనాకు అడ్డుక‌ట్ట వేద్దామ‌ని పిలుపునిచ్చారు.

గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించ గలిగితే వైర‌స్ వ్యాప్తిని అరికట్టవచ్చని , ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజల భాగస్వామ్యం తోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలం అని పదే పదే చెప్తున్నారన్నారు.ఇతర సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలు ఒకటే కాబట్టి సాధ్యమైనంత తొందరగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలన్నారు. రాపిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా RTPCR ప‌రీక్ష చేయించుకోవాల‌ని మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా పలువురు ఆశా, ఎఎన్ఎం లతో మంత్రి జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు…వారి సమస్యలు అన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. జీతం పెంచే విషయం సీఎం గారితో చర్చిస్తామన్నారు. కరోనా తరువాత ప్రతి జిల్లా ఆశా, ఎఎన్ఎం లతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎర్రగుంట పీహెచ్‌సీ సుశీల,వనపర్తి జిల్లా మదనపురం లీలమ్మ, హైదరాబాద్ రానిగంజ్ నల్లగుట్ట – పద్మ, గ్యాస్ మండి – శ్రీలక్ష్మీ లను మంత్రి అభినందించారు.