ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నరు: హరీశ్‌రావు 

ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నరు:  హరీశ్‌రావు 
  • తెలంగాణపై ప్రధాని మోదీది కపట ప్రేమ
  • వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు 
  • రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్ష కోట్లు ఆపారు
  • కేసీఆర్ కిసాన్ నినాదంతో కాంగ్రెస్, బీజేపీ పరేషాన్​అవుతున్నయ్‌
  •  నర్సాపూర్‌‌లో పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి 

మెదక్​, నర్సాపూర్, వెలుగు: తెలంగాణలో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భారతంలో పాండవులు గెలిచినట్టు.. అంతిమ విజయం కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ జాతిదేనన్నారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పోడు రైతులకు హరీశ్‌రావు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణకు చాలా డబ్బులు ఇచ్చామని ప్రధాని చెప్పడం అబద్ధమని, హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆపారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం కేసీఆర్ గొప్పతనమేనన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు కేటాయించి, మౌలిక వసతులు కల్పిస్తుండటం వల్ల తెలంగాణకు కంపె నీలు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం సహకరిం చకపోగా, రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నదని, అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్‌‌ ప్రాజెక్టును ఆపారని ఆరోపించారు. మోదీ తెలంగాణపై కపట ప్రేమ చూపుతున్నారని, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే దానిని గుజరాత్‌కు మంజూరు చేసి, ఉత్త వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారని మండిపడ్డారు. లడ్డూ గుజరాత్‌కు ఇచ్చి, పిప్పరమెంట్ తెలంగాణాకు ఇచ్చినట్టుందని విమర్శించారు. 

బురద జల్లడం మానుకోండి...

రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేయకపోతే, అభివృద్ధి జరగకపోతే తెలంగాణకు కేంద్ర అవార్డులు ఎలా వస్తున్నాయని హరీశ్‌ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న కిసాన్ ఎజెండాతో కాంగ్రెస్​, బీజేపీలు పరేషాన్ అవుతున్నాయన్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ లాంటి వారు తెలంగాణకి వస్తే కేసీఆర్‌‌ను తిట్టుడే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి బురద జల్లడం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 10.71 శాతం మంది పోడు రైతులకు పట్టాలివ్వడం ద్వారా దేశంలో అత్యధిక పోడు పట్టాలిచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. పోడు భూములకు పట్టాలివ్వడం ద్వారా రైతులకు 10 రకాల ప్రయోజనాలు లభించనున్నాయని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూశాయే తప్ప వారికి మేలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులై ఉండి వివిధ కారణాలతో మొదటి విడతలో పోడు పట్టాలు అందని రైతులకు రెండో విడతలో అందజేస్తామని హామీ ఇచ్చారు.