
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన 100 పడకల యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడారు.
‘సెకండ్ వేవ్ తరువాత హైసియా, నిర్మాన్ సంస్థలు సంయుక్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతనికి 18 కోట్ల నిధులు అందించారు.
రూ. 1.10 కోట్లతో ఓపెన్ టెక్ట్స్ నుంచి నిలోఫర్‌లో ఐసియూ అప్డేట్ చేశారు. మొదటి కార్యక్రమంలో నిలోఫర్‌లో పాల్గొనటం సంతోషంగా ఉంది. ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖను మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం.
ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలి. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్.. కేసీఆర్ కిట్ వచ్చాక 50 శాతానికి పెరిగింది. తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయి. నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు తీసుకురావాలని కృషి చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించాం. రూ. 33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలను అందుబాటులోకి తీసుకొస్తాం. కరోన థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ. 133 కోట్లు కేటాయించాం. చిన్న పిల్లల కోసం 5000 పడకలను సిద్ధంగా ఉంచాం. వాక్సినేషన్లో దేశ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉంది. కరోనాను నియత్రించేందుకు వైద్యులు మరింత సమయం కేటాయించాలి’ అని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.