హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్యను150 నుంచి 300కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.సమీపంలోని మున్సిపాల్టీలు, గ్రామాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచడం ఏకపక్షమంటూ నాగేంద్ర ప్రకాశ్ రెడ్డి ఇతరులు లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు.
కొత్త డివిజన్ల ఏర్పాటుకు డిసెంబర్ 5న కమిషనర్‌కు నివేదిక అందిందని, తర్వాత 4 రోజులకే ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, దానిని 2000 చదరపు కిలోమీటర్లకు పెంచేలా తీసుకున్న సమాచారం బహిర్గతం కాలేదన్నారు. డివిజన్లల్లో జనాభా సంఖ్యలో అనూహ్యమైన తేడాలు ఉన్నాయన్నారు. డివిజన్ల మ్యాప్‌లు అందుబాటులో లేవని, డివిజన్ల వారీగా జనాభా లెక్కలు కూడా అందుబాటులో లేవన్నారు.
