కవిత బెయిల్ పిటిషన్​పై ఇవాళ విచారణ

కవిత బెయిల్ పిటిషన్​పై ఇవాళ విచారణ

న్యూఢిల్లీ, వెలుగు:  లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ గత నెల 26న కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే వాదనల సందర్భంగా తన చిన్న కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్ పైనా విచారణ చేపట్టాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న వాదనలు వింటామని తెలిపారు. 

అలాగే కవిత బెయిల్ పిటిషన్ పై తమ అభిప్రాయాలు తెలపాలని ఈడీని ఆదేశించారు. కాగా, కవితకు ఈ నెల 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన స్పెషల్ కోర్టు.. ఆమెకు జైలులో హోమ్ ఫుడ్, పుస్తకాలు, ఆభరణాలు ధరించేందుకు అనుమతి ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. జైలు రూల్స్ కు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. దీంతో తీహార్ జైలు రూల్స్ ప్రకారం.. కవితకు అండర్ ట్రయల్ ఖైదీకి కల్పించే వసతులు ఏర్పాటు చేశారు. జైలు ఆహారమే ఆమెకు అందిస్తున్నారు. ఆభరణాలు ధరించడానికి అనుమతించడం లేదు. ఇటీవల తన భర్త అనిల్ జైలుకు వెళ్లి కలిసినప్పుడు.. కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని, కనీసం మంగళసూత్రం కూడా వేసుకోనివ్వడం లేదని కవిత చెప్పారు. దీంతో ఈ విషయాలను కవిత తరఫు లాయర్లు సోమవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వని పక్షంలో జైలులో సౌలతులు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరనున్నారు.