కవిత బెయిల్ పిటిషన్లపై నేడు, రేపు విచారణ

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు, రేపు విచారణ
  • ఈ రెండ్రోజుల్లో కవిత, ఈడీ, సీబీఐల వాదనలు 
  • పూర్తి చేయాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సోమ, మంగళవారాల్లో విచారణ చేపట్టనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు, అలాగే కవిత అరెస్ట్‌‌‌‌కు ట్రయల్ కోర్టు సీబీఐకి అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆమె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గత శుక్రవారం సింగిల్‌‌ బెంచ్‌‌ విచారణ జరిపింది.

లిక్కర్ స్కాంలోని 50 మంది నిందితుల్లో కవిత మాత్రమే మహిళ అని, మహిళా చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే, కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ మాత్రం సమయం కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్‌‌ బెంచ్‌‌ స్పష్టం చేసింది. సోమవారం కవిత వాదనలు, మంగళవారం ఈడీ, సీబీఐల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించింది.

మరోవైపు, కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా.. ఆదివారం రాత్రి 10 గంటల్లోపు ఈ మెయిల్ ద్వారా తమ అభిప్రాయం తెలపాలని సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ మరోసారి వాదనలు విననుంది. కాగా, లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌‌లోని తన నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16న రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపర్చింది.

కవిత తిహార్‌‌‌‌ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించగా.. దాదాపు రెండు నెలలుగా తిహార్ జైలులోనే కవిత ట్రయల్ ఖైదీగా ఉన్నారు.