ఆటోలో దొరికిన గోల్డ్ చైన్ ను పోలీస్ స్టేషన్ లో ఇచ్చేందుకు వచ్చిన ఓ వృద్ధుడు గుండె పోటుతో పోలీస్ స్టేషన్ లోనే మరణించారు. ఈ ఘటన షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈ ఘటనపై సౌత్ , వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నల్లకుంటాలో నివాసం ఉండే మేఘన అనే మహిళ హైకోర్టులో టైపిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఇంటి నుండి ఓలా ఆటో బుక్ చేసుకొని హైకోర్టుకు వెళ్ళింది. ఆటో దిగిన తర్వాత తన మెడలో ఉండే 12 గ్రాముల గోల్డ్ చైన్ కనిపించకపోవడంతో భయాందోళనకు గురై ఆమె భర్తకు సమాచారం ఇచ్చింది. ఓలా ఆటో బుక్ చేసుకున్న డ్రైవర్ కు ఫోన్ చేసిన ఆమె భర్త చైన్ గురించి ఆరా తీశాడు. అయితే అప్పటికే బేగంబజార్ లో మరో బుకింగ్ రావడంతో గోవింద్ రామ్ సోని (70) మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆటో ఎక్కాడు. ఆయనకు ఈ గోల్డ్ చైన్ కనిపించడంతో ఆటో డ్రైవర్ లీనవత్ తరుణ్ ఈ చైన్ ఇంతకు ముందు ఆటో బుక్ చేసుకున్న మహిళకు చెందిన చైన్ అని... తనకు ఇస్తే వారికి అందజేస్తానని తెలిపాడు. ఆటో డ్రైవర్ పై నమ్మకం లేని గోవింద్ రామ్ సోని చైన్ పోగొట్టుకున్న వారిని స్థానిక షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు వస్తే , అక్కడే అందజేస్తానని తెలిపాడు. అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అనంతరం , చైన్ పోగొట్టుకున్న మహిళ మేఘన అక్కడికి రావడంతో చైన్ ను పోలీసుల సమక్షంలోనే ఆమెకు అందజేశారు.
కాసేపు పోలీస్ స్టేషన్ లోనే కూర్చున్న వృద్ధుడు ఒక్కసారిగా గుండె పోటు తో కుప్పకులాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి తప్పిదం లేదని , అన్ని సీసీటీవీ కెమెరాలతో రికార్డ్ అయ్యాయని... యాదృచ్చికంగానే గోవింద్ రామ్ గుండె పోటుతో మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు. మంచి చేయడానికి వెళ్లి , ప్రాణాలు కోల్పోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు గోపాల్ సోని ఫిర్యాదుపై షాహీనాయత్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
