హైదరాబాద్: తెలంగాణ ఎర్రబడింది. వచ్చే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 44 డిగ్రీల పైనే భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు మంటెత్తిస్తాయని IMD పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత, వేడి వాతావరణంతో పాటు వడగాలులు వీచే అవకాశంతో తెలంగాణ జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు.
అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం, ఎండ తీవ్రత, వడగాలులు వీచే అవకాశంతో మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు రావద్దని హెచ్చరించారు. మంగళవారం 7 జిల్లాల్లో 45 డిగ్రీల పైన గరిష్ట ఉష్ణోగ్రతలు, వడ గాలులు వీచే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 26 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
బుధవారం.. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి. మీ)తో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురు వారాల్లో12 జిల్లాలకు రెడ్, 21 జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
బుధ, గురు వారాల్లో.. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులపాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో వడ గాలులు వీచే అవకాశం ఉండటంతో.. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
