భారీగా పెంచిన మెట్రో పార్కింగ్ ఛార్జీలు

భారీగా పెంచిన మెట్రో పార్కింగ్ ఛార్జీలు

హైదరాబాద్: మెట్రోకు ఆదరణ పెరుగుతున్నా సమస్యలు వెంటాడుతున్నాయి. పార్కింగ్ లో అసౌకర్యాలు, ఫీజును అమాంతం పెంచడంపై  ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తేసి… భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు జనం. మెట్రోతో మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నా… పార్కింగ్ కష్టాలు తప్పట్లేదు. మెట్రో ప్రారంభమైన మొదట్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయలేదు. ఏడాది తర్వాత నామమాత్రంగా రోజంతా బండి పార్క్ చేస్తే 10రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు డబుల్ చేసి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉచిత పార్కింగ్ కు విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పార్కింగ్ కూడా ఉదయం ఆరింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకే అనుమతిస్తున్నారు. సెక్యూరిటీ లేదనే కారణంతో రాత్రి తొమ్మిది తర్వాత వెహికిల్స్ పట్టించుకోవడం లేదు. ఇక కార్లు పెట్టుకునేందుకు మెట్రో స్టేషన్ల దగ్గర స్థలం కూడా ఉండట్లేదు. దాదాపు అన్ని స్టేషన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. కానీ పెరిగిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో మెట్రో అధికారులు విఫలమవుతున్నారు. ఎల్బీనగర్ లో ఇప్పటి వరకూ లేని పార్కింగ్ ఫీజును కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ కనీసం పార్కింగ్ కు సరైన ప్లేస్ లేదు. పార్కింగ్ చేసే స్థలంలో షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి, వర్షానికి తడుస్తున్నాయి. ముందు మెట్రో స్టేషన్ల దగ్గర సరైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాక డబ్బులు వసూలు చేయాలంటున్నారు సిటీ జనం.