దుబ్బాక ఫలితాలపై కాయ్ రాజా కాయ్

దుబ్బాక ఫలితాలపై కాయ్ రాజా కాయ్

దుబ్బాక బైపోల్ రిజల్ట్స్‌ పై జోరుగా బెట్టింగ్‌ లు

టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై పోటాపోటీగా పందాలు

‘అన్నా నువ్వు టీఆర్ఎస్ గెలుస్తదంటున్నవ్‌ . నేనేమో ఈసారి కచ్చితంగా బీజేపీ గెలుస్తదంటున్న. ఇద్దరం బెట్టు కడ్దాం. నేను ఓడిపోతే నా ఆటో నీకు ఇచ్చేస్తా. నువ్వు ఓడిపోతే నాకు మూడు లక్షలు ఇయ్యాలి ..’ చేగుంట టౌన్‌ కు చెందిన ఇద్దరి దోస్తు ల మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఇది..

నేను బీజేపీ గెలుస్తది అంటున్న. నువ్వేమో తక్కువ మెజారిటీతో అయినా టీఆర్ఎస్ బైటపడుతది అంటున్నవ్‌ . నేను అన్నట్టు బీజేపీ గెలుస్తదనుకో నువ్వు నాకు రూ.20 వేల సెల్ ఫోన్​ ఇప్పియ్యాలే. టీఆర్ఎస్ గెలిచిందనుకో నేను నీకు ఫోన్​ ఇప్పిస్తా..’ నార్సింగికి చెందిన ఇద్దరు వ్యక్తు లు ఇలా దుబ్బాక ఎలక్షన్​ రిజల్టు మీద బెట్ కట్టుకు న్నారు.

‘ఇగ సూడుబై నేను కానిస్టెన్సీ అంతటా ఎంక్వైరీ చేసిన ఏది ఏమైనా గాని ఈసారి బీజేపీ గెలుసుడు పక్కా. నువ్వు కాదంటే, నీకు దమ్ముంటే బెట్టు కట్టు. నేను ఓడిపోతే నీకు లక్ష రూపాయలు ఇస్తా. నువ్వు ఓడిపోతే నాకు లక్ష రూపాయలు ఇయ్యాలి..’ అని దుబ్బాక టౌన్‌ కు చెందిన ఇద్దరు యువకులు ఇలా బెట్టు కట్టా రు.

‘సోషల్ మీడియాలో, ఎక్కువ సర్వేల్లో బీజేపీ గెలుస్తదని వస్తుంది చూసి నువ్వు బీజేపీ గెలుస్తది అంటున్నవ్‌ . కానీ అది తప్పు. మళ్లా తప్పకుండా టీఆర్ఎస్ గెల్సుడు ఖాయం. నేను చేగుంట, నార్సింగి మండలాల్లో వారం రోజులు ఎలక్షన్ ప్రచారం చేసిన. ఈ రెండు మండలాల్లోనే కాదు. వేరే మండలాల్లో కూడా పబ్లిక్ ఎక్కువ శాతం కారుకే మొగ్గు చూపిన్రు. నేనన్నట్టు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ గెలిచిందనుకో మన దోస్తుగాళ్లందరని నువ్వు గోవా టూర్ తీస్కపోవాలి. లేక నువ్వన్నట్టు బీజేపీ గెల్సిందనుకో గోవా టూర్ ఖర్చంతా నేనే పెట్టుకుంటా..’ మెదక్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లీడర్లు ఇలా బెట్ కట్టుకున్నారు.

సిద్దిపేట/మెదక్, వెలుగు: దుబ్బాక బై ఎలక్షన్‌ పోలింగ్ ముగిసి వారం రోజులైనా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా దుబ్బాక ఎలక్షన్​ రిజల్టు పైనే డిస్కషన్ జరుగుతోంది. మొన్నటి దాకా ప్రచారాల హడావిడి ఉండగా, పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్​ఎట్లా ఉంటుందన్న దానిపై అందరి ఫోకస్ ఉంది. దుబ్బాక బై పోల్స్‌ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగడంతో రిజల్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపోటములపై ఎలక్షన్​ ప్రచారంలో పాల్గొ న్న టీఆర్ఎస్ , బీజేపీ లీడర్లతో పాటు కామన్​ జనాల్లో కూడా టెన్షన్​ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారన్న దానిపై దుబ్బాక సెగ్మెంట్‌‌తో పాటు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో జోరుగా పందాలు కాస్తున్నా రు. దుబ్బాక బై ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు..? గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది..? అనే దానితో పాటు, మండలాల వారీగా ప్రధాన రాజకీయ పార్టీల క్యాండిడేట్‌‌‌‌లకు లభించే మెజారిటీపై కూడా బెట్టింగ్‌‌‌‌లు కడుతున్నారు. పార్టీల లీడర్లే కాకుండా ఆయా రాజకీయ పార్టీలపై, పర్సనల్‌‌‌‌గా క్యాండిడేట్లపై అభిమానం ఉన్న యువకులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు సైతం బెట్‌‌లు కడుతున్నా రు. ఓట్ల లెక్కింపునకు ఇక ఒకరోజు గడువు మాత్రమే ఉండడంతో బెట్టింగ్‌‌ల జోరు పెరుగుతోంది. ఆయా పార్టీల గెలుపు ఓటములపై కొందరు బెట్ కడుతుండగా, మరికొందరు, గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై బెట్లు కడుతున్నారు. వారివారి స్థాయిని బట్టి వెయ్యి రూపాయలు మొదలుకుని లక్షల రూపాయల వరకు బెట్లు కడుతున్నారు.

బూత్‌ ల వారీగా బెట్

జనరల్‌‌‌‌గా ఎలక్షన్‌ లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై బెట్ కట్టడం తెలిసిందే. కాగా దుబ్బాక సెగ్మెంట్‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో పార్టీ క్యాండిడేట్‌‌‌‌ల గెలుపు ఓటములతో పాటు బూత్‌ల వారీగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే విషయంపై బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు చెందిన కొన్ని పోలింగ్ బూత్‌ ల పరిధిలో ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే అంశంపై పందాలు కాశారు. పోలింగ్ రోజుకు ముందు ఆయా బూత్‌ల ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనే విషయంపై స్పష్టతతో ఉన్నా తరువాత జరిగిన పరిణామాల నేపథ్యం లో ఓటర్ల మనసు మారినట్లు తెలుస్తోంది. అందుకే ఆయా మండలాలు, గ్రామాల పరిధిలో ఏ పార్టీ అభ్యర్థికి లీడ్ వస్తుందనే విషయంపై పందాలు కాస్తున్నారు.

జమానతులు..

దుబ్బాక బై పోల్ ఫలితాలపై బెట్‌‌‌‌లు కడుతున్న వారు ఒప్పుకున్న మొత్తాన్ని మధ్యవర్తుల వద్ద పెడుతున్నా రు. మరి కొన్ని చోట్ల పందెం గెలిస్తే ఇచ్చే డబ్బులకు జమానతులను చూపుతున్నట్టు తెలుస్తోంది. మొదట రహస్యంగా సాగిన ఈ పందెలు ప్రస్తుతం ఓపెన్‌ గా మారాయి. చాలా చోట్ల పైసల పందేలు కాస్తుండగా, కొందరు తాము పందెం గెలిస్తే మందు పార్టీలు ఇస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు.