గోదావరి బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న వరద నీరు

గోదావరి బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న వరద నీరు

ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడ్తున్న వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల గోదావరి వెనక్కి తన్ని మంచిర్యాల, మంథని లాంటి పట్టణాలు, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా గోదావరిఖని - మంచిర్యాల మధ్యనున్న గోదావరి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై.. రాకపోకలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సూరయ్యపల్లి, ఖానాపూర్, ఎక్లాస్ పుర్, మంథని పట్టణంలోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది. దీంతో సూరయ్యపల్లి ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

ఖానాపూర్ గ్రామాల ప్రజలు ఇళ్ళను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ నగర్, బోయిన్ పేట, వాసవి నగర్, సుభాష్ నగర్, లైన్ గడ్డ, మర్రివాడ వాసులను షెల్టర్స్ కు తరలించారు. మరోవైపు.. పార్వతి బ్యారేజ్ లోకి వరద నీరు భారీగా చేరుతోంది. 72 గేట్లు ఎత్తివేసి 12,92,068 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఇన్ ప్లో, అవుట్ ఫ్లో 12,92,068 క్యూసెక్కులుగా ఉంది. గోదావరి నది నుండి 12,77,068 క్యూసెక్కులు, జైపూర్, ఇతర ప్రాంతాల నుండి 15,000 క్యూసెక్కుల నీరు బ్యారేజ్ లోకి చేరుతోంది. బ్యారేజ్ పూర్తిస్థాయి లెవల్ 130.00 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం బ్యారేజ్ లెవెల్ 130.00 మీటర్లుగా ఉంది.