కృష్ణా నదికి భారీ వరద.. జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేత

కృష్ణా నదికి భారీ వరద.. జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్: కృష్ణా నదికి వరద భారీగా పెరిగింది. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుండి వరద నీటిని పెద్ద ఎత్తున విడుదల చేస్తుండంతో జూరాల వద్ద 39 గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయిన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లలో వరదను నిల్వ చేసే అవకాశం లేక వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు కు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.

జూరాల ప్రాజెక్టు వద్ద ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి ఇన్ ఫ్లో  లక్ష 93వేల క్యూసెక్కులకు పెరగడంతో మొత్తం 28 గేట్లు ఎత్తారు. మధ్యాహ్నానికి వరద 2 లక్షల 56 వేల క్యూసెక్కులకు పెరగడంతో మరో 11 గేట్లు కలిపి మొత్తం 39 గేట్ల ద్వారా  ఔట్ ఫ్లో: 2 లక్షల 83  వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం  7.297 టీఎంసీలు నిల్వ ఉంచుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం: 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.310 మీటర్లు కొనసాగిస్తున్నారు. ఎగువ , దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.