50 ఏండ్లలో ఐదోసారి బంగాళాఖాతంలోకి  భారీగా వరద నీరు

50 ఏండ్లలో ఐదోసారి బంగాళాఖాతంలోకి  భారీగా వరద నీరు
  • 5 వేల టీఎంసీలు సముద్రంపాలు
  • ఈ ఏడాది ప్రారంభం నుంచీ పరవళ్లు తొక్కుతున్న గోదావరి
  • 50 ఏండ్లలో ఐదోసారి బంగాళాఖాతంలోకి  భారీగా వరద నీరు
  • ఈ సీజన్​లో 6 వేలకుపైగా టీఎంసీలు సముద్రంలో కలిసే అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరి వరదంతా సముద్రం పాలవుతున్నది. ఈ సీజన్‌‌లో ఇప్పటికే ఐదు వేలకుపైగా టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. నిరుడు ఫ్లడ్‌‌ సీజన్‌‌ మొత్తంలో గోదావరి నుంచి 2,502 టీఎంసీలు సముద్రంలో చేరగా ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే అంతకన్నా ఎక్కువ నీళ్లు దిగువకు వెళ్లాయి. ఈ ఏడాది జూన్‌‌  ఒకటో తేదీ నుంచి జులై 19 వరకు 8.16 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లగా ఆ తర్వాత ప్రవాహం భారీగా పెరిగింది. ఒకానొక దశలో రోజుకు 200 టీఎంసీలకుపైగా నీళ్లు బంగాళాఖాతంలోకి వెళ్లిపోయాయి. ఆదివారం ఉదయం వరకు సముద్రంలోకి 5,139 టీఎంసీల నీళ్లు చేరాయి. దిగువ గోదావరిలోనూ వరదలు కొనసాగుతుండడంతో ఇంకో వెయ్యి టీఎంసీల వరకు నీళ్లు సముద్రంలోకి వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.  గడిచిన 50 ఏండ్లలో కేవలం ఐదు సార్లు మాత్రమే గోదావరి నుంచి ఐదు వేల టీఎంసీలు, అంతకుపైగా నీళ్లు సముద్రంలో కలిశాయి. సుమారు పదిసార్లు నాలుగు వేలకుపైగా టీఎంసీలు దిగువకు వెళ్లాయి. 

గోదావరి చరిత్రలో 1990–91 ఫ్లడ్‌‌ ఇయర్‌‌లో అత్యధికంగా ఏడు వేల టీఎంసీలకుపైగా నీళ్లు సముద్రంలోకి చేరాయి. 1994 –95 ఆరు వేల టీఎంసీలకు చేరువగా నీళ్లు బంగాళాఖాతంలోకి చేరాయి. ఈ ఫ్లడ్‌‌ సీజన్‌‌లో సెకండ్‌‌ హయ్యెస్ట్‌‌ మార్క్‌‌ను గోదావరి చేరుకునే అవకాశముందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్‌‌ నెలాఖరుతో వర్షాకాలం సీజన్‌‌ ముగుస్తుంది. కానీ ఏటా అక్టోబర్‌‌, నవంబర్‌‌, డిసెంబర్‌‌ నెలల్లోనూ తుపాన్ల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇంకో ఒకటి, రెండు పర్యాయాలు గోదావరిలో భారీ వరదలు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కృష్ణా నది నుంచి భారీ ప్రవాహాలే ప్రకాశం బ్యారేజీ దాటి బంగాళాఖాతంలోకి చేరుతున్నాయి. నిరుడు ఫ్లడ్‌‌ సీజన్‌‌ మొత్తం 501 టీఎంసీలు కృష్ణా నది నుంచి సముద్రంలోకి చేరగా, ఈ ఏడాది ఇప్పటికే 704 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి.  కృష్ణాలోనూ మరికొన్ని రోజులు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ నది నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా కడిలి పాలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.