వరదల్లో చిక్కుకున్న గ్రామాలు

వరదల్లో చిక్కుకున్న గ్రామాలు

రాష్ట్రంలో కుండా పోతగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోనీ 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీటి చుట్టూ ఉన్న ఐదు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని గ్రామాలలో అంథకారం అలుముకుంది. గుంజేడు తోగు వాగు, వెలుబెల్లి కత్తెర వాగు, కొత్తగూడ గాదె వాగు, మొండ్రాయి గూడెం వాగు, ముస్మి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామలకు అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. 

వెలుబెల్లి కత్తెర వాగు వద్ద గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను అడ్డుగా పెట్టి, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుంజేడు తోగు వాగు వద్ద కర్రలతో బ్లాక్ చేశారు. గాదె వాగు వద్డ చీరలను అడ్డుగా కట్టి రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఏజన్సీ లోనీ 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొత్తగూడ, కొత్తపల్లి, పెగడపల్లి, ఎదుళ్ళపెల్లి, గోవిందాపురం, నీలంపెల్లి, జంగవానిగూడెం, రాంపురం, ఎర్రవరం, కుందనపల్లి, సరసనపల్లి, ఓటాయి, అంకన్నగూడెం, సాథిరెడ్డిపెల్లి, మొండ్రాయిగూడెం, ఎంచగూడెం, గుండంపల్లి గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.