
- జంట జలాశయాల ఎగువ ప్రాంతంలో భారీ వానలు
- వికారాబాద్‌లో 15 సెం.మీ, వర్షపాతం
- భారీ వరద రావడంతో 36 వేల క్యూసెక్కులు వదిలిన వాటర్‌బోర్డు అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చాలా ఏండ్ల తర్వాత జంట జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు ఊహించని రీతిలో ఇన్‌ఫ్లో పెరిగింది. భారీ ఎత్తున వస్తున్న వరదను నిల్వచేసుకునే సామర్థ్యం లేకపోవడం, ఇప్పటికే ఫుల్ట్యాంక్లెవెల్కు చేరుకున్న ఈ రెండు జలాశయాల్లోకి అదనంగా భారీ వరద చేరుకోవడంతో మెట్రోవాటర్‌బోర్డు అధికారులు రెండు జలాశయాలకు సంబంధించి దాదాపు అన్ని గేట్లను ఎత్తారు. దీంతో మూసీకి వరద ఉధృతి పెరిగి సమీప ప్రాంత కాలనీలు, బస్తీలు నీటమునిగాయి.
గత 30 ఏండ్లలో ఇంత తీవ్రమైన ప్రవాహం చూడలేదని స్థానికులు అంటున్నారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాలైన జన్వాడ, శంకర్పల్లి, మొయినాబాద్, మోమిన్‌పేట, మర్పల్లి తదితర ప్రాంతాలలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక్క వికారాబాద్‌లోనే రెండు రోజుల్లో 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్ లో15 సెం.మీ. థారూర్‌లో 12.50 సెం.మీ., షాబాద్ 11.83 సెం.మీ,బంట్వారం 11.25 సెం.మీ. . పూడూర్ లో - 11.13 సెం.మీ., నవాబుపేటలో 10.48 సెం.మీ., మోమిన్ పేటలో - 9.87సెం.మీ., బంట్వారం -7.76 సెం.మీ., మర్పల్లి - 7.46 సెం.మీ., కోటపల్లి - 6.68 ఎంఎం, , వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జంటజలాశయాలకు భారీగా వరద వచ్చి చేరింది. దీనిని మూసీలోకి వదలడం వల్ల ఉగ్రరూపం దాల్చింది.
జంట జలాశయాలకు తగ్గిన వరద ఉధృతి
జంట జలాశయాలకు వరద ఉధృతి తగ్గింది. శనివారం వర్షం కురవకపోవడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద తాకిడి తగ్గింది. దీంతో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నానికి ఈ రెండు జలాశయాల నుంచి 33వేల క్యూసెక్కులను వదిలారు. మధ్యాహ్నానికి వరద తగ్గుముఖం పట్టడంతో 10 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఉస్మాన్సాగర్నాలుగు గేట్లను తిరిగి మూసివేశారు. హిమాయత్ సాగర్ఏడు గేట్లను క్లోజ్చేశారు.
ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు ఏడు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 8 గేట్లు ఎత్తి 6,176 క్యూసెక్కులు వదులుతున్నారు. దీని ఫుల్‌ట్యాంక్‌లెవెల్1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1788.55 అడుగుల మేరకు నీరుంది. హిమాయత్ సాగర్ కి 5 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 4 గేట్లు ఎత్తి 3,581 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఫుల్ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.55 అడుగుల నీరుంది. జంట జలాశయాల నుంచి విడుదలవుతున్న అవుట్ ఫ్లో తగ్గడంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పది రోజులుగా మూసీలోకి వరద..
నిజానికి పది రోజుల నుంచే జంటజలాశయాల్లో పెరుగుతున్న వరదను కొద్ది కొద్దిగా మూసీలోకి వదులుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇస్తూ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కానీ, రెండు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రెండు రోజుల క్రితం మూసీలోకి 25,250 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు, శుక్రవారం నాటికి వరద తీవ్రత పెరగడంతో నిల్వచేసుకునే సామర్థ్యం లేక 33,600 క్యూసెక్కులు వదిలారున.
దీంతో ఊహించని రీతిలో మూసీ ఉగ్రరూపం దాల్చింది. అప్పటికే అధికారులు పరీవాహక ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే, కొందరు భవనాల పై అంతస్తుల్లో ఉండడం వల్ల తమకేం కాదన్న ధీమాతో ఉన్నారు. అయితే వరద తీవ్రత పెరగడంతో మూసీకి ఇరువైపుల ఉన్న కాలనీలు, బస్తీలలోకి నీరు వచ్చేసింది. దీంతో సమస్య ఏర్పడింది.