దంచింది వాన..పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ వర్షం

దంచింది వాన..పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ వర్షం
  • ఈదురుగాలులతో విరిగిపడిన చెట్ల కొమ్మలు, స్తంభాలు
  • పైకప్పులు లేచిపోవడంతో ఇబ్బందులు
  • హైదరాబాద్​లో పలు ప్రాంతాలు జలమయం.. ట్రాఫిక్​ జామ్
  • మంచిర్యాల జిల్లా కుందారంలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం
  • మరో రెండు రోజులు వానలు పడే చాన్స్
  • నేడు కేరళను తాకనున్న నైరుతి

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షాలు కురిశాయి. అరేబియా సముద్రం, లక్షదీవుల ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటంతో వానలు పడుతున్నాయి. దీంతో టెంపరేచర్లు తగ్గి వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో ఏడు చోట్ల భారీ వర్షాలు, 125 ప్రాంతాల్లో మోస్తరు వానలు, 158 ప్రదేశాల్లో తేలికపాటి జల్లులు, 92 చోట్ల అతి తేలికపాటి జల్లులు కురిశాయి. భారీ వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. హైదరాబాద్​లో చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో జనం ఇబ్బందులుపడ్డారు.

మంచిర్యాల జిల్లా కుందారంలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 7.2, పెద్దపల్లిలోని మారేడుపల్లిలో 6.9, మల్యాలలో 6.8, రంగారెడ్డి జిల్లాలోని సౌత్‌ హస్తినాపురంలో 6.6, సంగారెడ్డిలోని జిన్నారంలో 5.8, రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 5.8, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 4.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

హైదరాబాద్​లో జడివాన

హైదరాబాద్​లోనూ చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో వాన పడింది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. మలక్​పేట నియోజకవర్గం అక్బర్ బాగ్ దయానంద్ నగర్ కు చెందిన ప్రవీణ్​గౌడ్(28) అనే సాఫ్ట్​వేర్​కరెంట్​షాక్​తో చనిపోయాడు. పటాన్​చెరులో అత్యధికంగా 7 సెంటీమీటర్లు వాన పడింది. వానతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. పలు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

నిర్మల్‌లో 43.3 డిగ్రీలు

రాష్ట్రంలో ఆదివారం ఎండలు కాస్త తగ్గాయి. శనివారం అత్యధికంగా 42 డిగ్రీల మేర టెంపరేచర్​ఉండగా, ఆదివారం 43.3 డిగ్రీలకు చేరింది. కొన్ని చోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నిర్మల్‌లో 43.3, నిజామాబాద్‌లో 43, జగిత్యాలలో 42.5, భద్రాద్రి కొత్తగూడెంలో 42.5, ఆదిలాబాద్‌లో 42.3, సూర్యాపేటలో 42.2, ఖమ్మంలో 41.9, కామారెడ్డిలో 41.6 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా కాస్త పెరిగాయి. శనివారం అనేక చోట్ల 25డిగ్రీలలోపే పరిమితం కాగా.. ఆదివారం అనేక చోట్ల 25 – 27 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

నేడు కేరళకు ‘నైరుతి’

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవులు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత 24 గంటల్లో తుఫాన్​గా మారవచ్చని అంచనా వేసింది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3 లోపు ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను తాకే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతానికి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెప్పింది.

వడ్లు తడిచినయ్​

వెలుగు నెట్​వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం కుంటాల, ముథోల్ మండలాల్లో ఆదివారం కురిసిన వర్షంతో వందల  క్వింటాళ్ల ధాన్యం నీట మునిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో వడగండ్లు పడ్డాయి. మందమర్రి, బెల్లంపల్లి మండలాల్లో కరెంట్ పోల్స్ విరిగాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ఆసిఫాబాద్ మండలంలో గంటపాటు భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ లో పలుచోట్ల ఇండ్లు దెబ్బతిన్నాయి. గజ్వేల్​ మండలంలో వడగండ్ల వాన కురిసింది. అహ్మదీపూర్​లో రెండు ఇండ్లు కూలిపోయాయి. నాగర్ కర్నూల్​జిల్లా కోడేరు మండలంలోని కుడికిళ్ల గ్రామానికి చెందిన ఆరేపల్లి కృష్ణయ్య(68) ఆదివారం మధ్యాహ్నం తన పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఉప్పునుంత ల మండలం లత్తిపూర్‌‌ స్టేజీ వద్ద పిడుగు పడి తిప్ప రెడ్డిపల్లి, బొగ్గులధోనా గ్రామాలకు చెందిన కుమార్, లాలాకు గాయాలయ్యాయి.  నాగర్‌‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌, వనపర్తి జిల్లా కొత్తకోట, గద్వాల, అయిజ, మల్దకల్‌లో ఈదురుగాలులతో న వర్షం కురిసింది.

జగదీష్ వర్ససె ఉత్తమ్..నువ్వేంది..నీలెక్కేంది