తాండూరులో నీట మునిగిన కాలనీలు

తాండూరులో నీట మునిగిన కాలనీలు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన కుండపోత వానకు పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ఇండ్ల ముందు పార్క్ చేసిన కార్లు, బైక్ లు నీటిలో మునిగిపోయాయి. రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా ఇండ్లలోకి వచ్చిన వరదనీటిని బయటకు తోడేస్తున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. 

కొందరు అక్రమార్కులు కాలువలను కబ్జా చేయడంతో ఇండ్లలోకి వరదనీరు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షానికి హైదరాబాద్ -తాండూరు ప్రధాన రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిలుకవాగును భూ బకాసురులు కబ్జా చేయడంతో 40 ఫీట్లు ఉండే వాగు ఇప్పుడు 5 ఫీట్లకే పరిమితమైందన్నారు. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే వరదనీరు ఇండ్లలోకి చేరుతుందని చెబుతున్నారు. తాండూరు పట్టణంలోని మిత్రానగర్ మార్కండేయ కాలనీవాసులు కాలు బయట పెట్టకుండా బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కబ్జాదారుల నుండి చిలక వాగును రక్షించి వెడల్పు చేయాలని కోరుకుంటున్నారు.