వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు.. మునిగిన పంటలు

వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు.. మునిగిన పంటలు
  • అత్యవసరమైతేనే బయటకు రావాలన్న కలెక్టర్
  • పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్, ట్రెక్కింగ్ నిలిపివేత

వికారాబాద్/పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నస్కల్, పాలేపల్లి, గొడుగున్, బాస్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నస్కల్ వాగు పొంగడంతో లక్నాపూర్ ప్రాజెక్ట్ మత్తడి పారుతోంది.

 రాపోల్, బాస్పల్లి, ఎంకేపల్లి, గొడుగున్పల్లి గ్రామాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలు నీట మునిగాయి. పరిగి తహసీల్దార్, సీఐ శ్రీనివాస్ రెడ్డి నస్కల్ వాగు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి కలిసి రంగాపూర్, బసిరెడ్డిపల్లి, నస్కల్ వాగు, పరిగి మున్సిపల్ టౌన్లను సందర్శించి, అధికారుల పనితీరును పర్యవేక్షించారు. అలాగే ధారూర్ మండలం నాగసముందర్ వద్ద కోటపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్, ట్రెక్కింగ్​ను తాత్కాలికంగా నిలిపివేశామని, పర్యాటకులెవరూ రావొద్దని కలెక్టర్ సూచించారు.