వందేళ్ల తరువాత: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షం..

వందేళ్ల తరువాత: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షం..

భారీ వర్షానికి హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. 111 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 1908 తర్వాత ఈ ఏడాది అత్యధిక వర్షపాతం నమోదైంది. వానలతో అలర్ట్ అయిన GHMC సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అన్ని శాఖల సిబ్బంది ఫీల్డ్ లోనే ఉన్నారు. వాటర్ లాగింగ్ ను క్లియర్ చేస్తూ… పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న సాయంత్రం మొదలైన భారీ వర్షం అర్థరాత్రి  వరకు కురిసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదైంది. తెల్లవారుజామున వరకు కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం చెరువును తలపించింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అంతటి వర్షంలోనూ GHMC అధికారులు, సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా నీళ్లు ఎక్కువ సేపు నిలవకుండా క్లియర్ చేశారు. నాలాలను పునరుద్ధరించారు. వర్షపు నీటిని మళ్లించారు.

వర్షం పడుతున్నా వెనక్కి తగ్గకుండా సహాయక చర్యలు చేపట్టింది GHMC. రెస్క్యూ బృందాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్స్, మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు వేగంగా స్పాట్లకు చేరుకున్నాయి. నాగోల్ లో నాలాలో పడిన వ్యక్తిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. GHMC మేయర్ బొంతు రామ్మోహన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అర్థరాత్రి నుంచి ఆయన సిటీలో పర్యటిస్తు… పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్, ఆల్వాల్, బేగం బజార్ లలో బొంతు రామ్మోహన్ పర్యటించారు.

హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. కాసేపట్లో తూములను పరిశీలించనున్నారు బొంతు రామ్మోహన్. లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ లైన్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది ప్రభుత్వం.