
బుధవారం ( ఆగస్టు 20 ) సాయంత్రం హైదరాబాద్ లో వర్షం కురిసింది.. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన మోస్తరు వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో ఇవాళ రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. పనులు త్వరగా ముగించుకొని ఇళ్లకు వెళ్లాలని సూచించింది వాతావరణ శాఖ.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 18న తెలంగాణకు మూడు రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భద్రాద్రి, మహబూబాబాద్ ,ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.